నవతెలంగాణ – ఆదిలాబాద్ టౌన్
సమ సమాజ స్థాపనలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో ఉంటుందని, అలాంటి వృత్తిని ఎంచుకోవడం అదృష్టంగా భావించాలని ఎమ్మెల్యే పాయల శంకర్ అన్నారు. డీఎస్సీ2024 ద్వారా ఎంపికైన నూతన ఉపాధ్యాయుల ఆత్మీయ సమ్మేళనం, అవగాహన సదస్సును పీఆర్టీయూ టీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆదివారం పీఆర్టీయూ భవనంలో నిర్వహించిన ఈ సదస్సుకు ఎమ్మెల్యే ముఖ్య అథితిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు కొమ్ముకృష్ణ కుమార్ పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా వాటి పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి కల్లెంభూమారెడ్డి ఆస్పత్రి వైద్యుడు కల్లెం వెంకట్ రెడ్డి చేస్తున్న సామాజిక కార్యక్రమాలకు గాను పీఆర్టీయూటీఎస్ తరపున ఎమ్మెల్యే శాలువతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల శంకర్ మాట్లాడుతూ… చాలా మందికి ప్రభుత్వ కొలువులు సాధిస్తారని, అందులో ఉపాధ్యాయ వృత్తి ఎంతో కీలకమన్నారు. నేడు ప్రపంచ దేశాలు భారత దేశం వైపు చూసేల ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పాలన సాగిస్తున్నారని తెలిపారు. ఉపాధ్యాయులు కూడా బాధ్యతగా విద్యార్థులను మంచి పౌరులుగా తీర్చిదిద్దేలా బోధనలు చేయాలని సూచించారు. పలు సమస్యలను సంఘం నేతలు తన దృష్టికి తీసుకువచ్చారన్నారు. వాటి పరిష్కరం కోసం కృషి చేస్తానన్నారు. ప్రభుత్వాలు ఎవైన వాటికి సమస్యలున్నాయని, కానీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిందేనని చెప్పారు. సమాజం పట్ల రాజకీయ నాయకులకు ఉన్న బాధ్యత ఉపాధ్యాయులకు కూడా ఉంటుందన్నారు. ఆ దిశగా ప్రతి ఉపాధ్యాయుడు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పీఆర్టీయూ టీఎస్ ప్రధాన కార్యదర్శి నరసహింహస్వామి, గౌరవ అధ్యక్షుడు గోవర్ధన్, రాజు, వినోద్, శేఖర్, జయశ్రీ, జోత్స్న పాల్గొన్నారు.