నామినేటెడ్‌ పదవుల్లో క్రైస్తవులకు ప్రాధాన్యత నివ్వాలి

నామినేటెడ్‌ పదవుల్లో క్రైస్తవులకు ప్రాధాన్యత నివ్వాలి–  రాష్ట్ర క్రిస్టియన్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ డిమాండ్‌
హైదరాబాద్‌ : తెలంగాణలో ఉన్న క్రైస్తవులకు వెంటనే అన్ని నామినేటెడ్‌ పదవులు రాష్ట్ర స్థాయి నుంచి గ్రామస్థాయి వరకు ఇప్పించాలని రాష్ట్ర క్రిస్టియన్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటి అధ్యక్షులు ఎం. సాల్మన్‌ రాజు ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలకూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వం రాష్ట్రంలోని క్రైస్తవుల సంక్షేమానికి మరింత కృషి చేయాలని కోరారు. గత ప్రభుత్వం పేద క్రైస్తవులకు ఒక లక్ష రూపాయలు మంజూరు చేసింది. ఎన్నికల కోడ్‌ వల్ల ఆ సహాయం ఆగిపోయిందన్నారు. దాన్ని వెంటనే మంజూరు చేసి నిరుపేద క్రైస్తవ కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. క్రైస్తవుల అంతిమ సంస్కారాల కోసం బీఆర్‌ఎస్‌ సర్కార్‌ సుమారు 63.37 ఎకరాల భూమిని కేటాయిస్తూ జీవో జారీ చేసిందన్నారు. అయితే దీనికి సరిహద్దులు ఏర్పాటు చేసి ఇవ్వాలని కోరారు. అదే విధంగా రాష్ట్రంలో కొన్ని చర్చీల నిర్మాణంలో ఉన్నాయని వాటికి ప్రభుత్వం నిధులు విడుదల చేయాలని కోరారు. ఉప్పల్‌ బగాయత్‌లో నిర్మించ తల పెట్టిన క్రిష్టియన్‌ భవన నిర్మాణ పనులు ప్రారంభించాలని కోరారు. రాష్ట్రంలో క్రైస్తవులపైజరుగుతున్న దాడులను అరికట్టాలని విజ్ఞప్తి చేశారు. మైనార్టీ మహిళలకు కుట్టు మిషన్లు జారీ చేసినా… మంజూరు కాలేదని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ కార్యదర్శి డాక్టర్‌ కె. ఎన్‌ జాకబ్‌, సంయుక్త కార్యదర్శి రాజేష్‌, సుధోష్‌, కెన్నీ, జయకుమార్‌, ప్రకాశ్‌ తదితరులు పాల్గొన్నారు.