
గ్రామాల్లో అపరిచిత వ్యక్తులు సంచరిస్తే వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డిచ్ పల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ కె.మల్లేష్ సూచించారు. గురువారం డిచ్ పల్లి సర్కిల్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇటీవల సర్కిల్ పరిధిలో నెంబర్ ప్లేట్లు లేని ద్విచక్ర వాహనాలపై గ్రామాల్లో సంచరిస్తూ దొంగతనాలకు పాల్పడుతున్నారన్నారు. అలాంటి వారి పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండి గ్రామాల్లో కొత్త వ్యక్తులు సంచరిస్తే వేంటనే సమాచారాన్ని స్థానిక పోలీసులకు సమాచారమం దించాలన్నారు. సీపీ కళ్మేశ్వర్ఆ దేశాల మేరకు త్వరలోనే సర్కిల్ పరిధిలో దొంగతనాల నివారణకు గ్రామాల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి ప్రజలను చైతన్యవంతం చేస్తామన్నారు. అందరూ సహకరిస్తేనే శాంతిభద్రతల పరిరక్షణ సాధ్యమన్నారు. జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని, ప్రమాదాలు జరిగే చోట ప్రమాద సూచిక బోర్డులు ఏర్పాటు చేస్తామన్నారు. యువకులు మద్యం సేవించి వాహనాలు నడిపి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దన్నారు. రహదారిపై నెంబర్ ప్లేట్లు లేని వాహనాలను పట్టుకుని జరిమానాలు విధిస్తున్నామన్నారు. ప్రతిఒక్కరూ వాహనాలు కొనుగోలు చేసిన వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకుని నెంబర్ ప్లేట్ను బిగించుకోవాలన్నారు. అలాగే హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలన్నారు. పత్రికల్లో పని చేయకుండానే కొందరూ ద్విచక్ర వాహనాలకు ప్రెస్ స్టిక్కర్ వేసుకుని సంచరిస్తున్నారని వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. అలాంటి వాహనదారులపై చర్యలు తీసుకోవాలని డిచ్ పల్లి ప్రెస్ క్లబ్ నుంచి తమకు ఫిర్యాదు కూడా అందిందని సిఐ కె మల్లేష్ తెలిపారు. గ్రామాల్లోని యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి గ్రామాల అభివృద్ధిలో భాగస్వాములు కావలన్నారు. ఏదైనా సమస్య ఉంటే నేరుగా కలవ వచ్చని సూచించారు.