పోలీస్ వృత్తి ఉన్నతమైనదని, నిరంతరం ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా పనిచేయాలని, తుంగతుర్తి సిఐ శ్రీను నాయక్ అన్నారు. 9 నెలల శిక్షణ పూర్తి చేసుకొని 16 మంది పురుషులు, 6 గురు మహిళలు మొత్తం 22 మంది నూతన కానిస్టేబుల్స్ సర్కిల్ పరిధిలోని తుంగతుర్తి, నూతనకల్, మద్దిరాల పోలీస్ స్టేషన్లో మంగళవారం రిపోర్ట్ చేసిన సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలిపి పలు సూచనలు ఇచ్చారు. ఈ మేరకు పోలీసు ఉద్యోగం సవాళ్లతో కూడినదని, పోలీసు విధులు చాలా ప్రత్యేకమైనవని, ఉన్నత లక్ష్యంతో పనిచేసి సమాజంలో గుర్తింపు తెచ్చుకోవాలని తెలిపారు. క్రిమినల్స్ పట్ల కఠినంగా వ్యవహరిస్తూనే సాధారణ ప్రజలతో స్నేహపూర్వక వాతావరణం కలిగి ఉండాలని ఆదేశించారు. సమస్యలతో బాధపడుతూ బాధితులు పోలీస్ స్టేషన్కు వస్తారని, అలాంటి వారికి ధైర్యం భరోసా కల్పించాలని అన్నారు. మన ప్రవర్తన, మన విధుల పట్ల, మన తల్లిదండ్రులకు, పోలీస్ శాఖకు, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు. క్రమశిక్షణ లేకుండా ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తే శాఖపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అక్రమ రవాణా, పిడిఎస్ బియ్యం, డ్రగ్స్, సైబర్ నేరాల లాంటి అసాంఘిక కార్యకలాపాలను నివారించడంలో నిరంతరం కృషి చేయాలని సూచించారు. అదేవిధంగా కష్టపడి పోలీసు ఉద్యోగాలు సాధించిన మీరు ఇక్కడే ఆగిపోకుండా ఇంకా ఉన్నతమైన స్థాయికి చేరుకుని, తల్లిదండ్రుల ఆశలను నెరవేర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో తుంగతుర్తి ఎస్ఐ క్రాంతి కుమార్,నూతనకల్ ఎస్సై మహేంద్రనాథ్,మద్దిరాల ఎస్సై వీరయ్య నూతన కానిస్టేబుల్స్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.