4 భాషల్లో సికాడా

In 4 languages Cicadaతెలుగులో ప్రస్తుతం పాన్‌ ఇండియన్‌ ప్రాజెక్టులు రూపొందుతున్నాయి. ఈ క్రమంలోనే అందరినీ ఓ కొత్త కాన్సెప్ట్‌తో పలకరించేందుకు ‘సికాడా’ అనే చిత్రం రాబోతోంది. ఒకే టైటిల్‌, ఒకే కథ, 4 విభిన్న భాషలు, 24 విభిన్న ట్యూన్స్‌తో ఈ మూవీ విడుదలకు ముందే సంచలనాలు సష్టించేలా కనిపిస్తోందనే దీమాని చిత్ర బృందం వ్యక్తం చేస్తోంది.
తాజాగా ఈ మూవీ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను దర్శకుడు చందూ మొండేటి, యువ కథానాయకుడు సోహెల్‌ విడుదల చేశారు. ప్రస్తుతం ఈ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌, నటీనటుల లుక్స్‌, గెటప్స్‌ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ‘సికాడా’ యూనిట్‌లో అంతా కూడా కొత్త వారే. శ్రీజిత్‌ ఎడవనా దర్శకుడిగా పరిచయం కాబోతోన్నారు.
తీర్నా ఫిల్మ్స్‌ అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై వందనా మీనన్‌, గోపకుమార్‌ పి నిర్మిస్తున్న ఈ చిత్రంలో రజిత్‌ సిఆర్‌, గాయత్రి మయూర, జైస్‌ జోస్‌ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా షూటింగ్‌ బెంగుళూరు, అట్టపాడి, వాగమోన్‌, కొచ్చి తదితర ప్రాంతాల్లో జరిగింది. తెలుగు భాషలోనే కాకుండా కన్నడ, తమిళం, మలయాళ భాషల్లో కూడా ఈ చిత్రాన్ని రూపొందించారు. శ్రీజిత్‌ ఎడవనా మ్యూజిక్‌ డైరెక్టర్‌గా ‘కాదల్‌ ఎన్‌ కవియే’, ‘నెంజోడు చేరు’ వంటి తమిళ, మలయాళ సినిమాలకు పని చేశారు. ఇప్పుడు సికాడాతో దర్శకుడిగా పరిచయం కానుండటం విశేషం. ఈ చిత్ర పాటలకు రవితేజ అమరనారాయణ అద్భుతమైన సాహిత్యం అందించారు.