– ప్రతి ఏటా ఫిబ్రవరి 6న తెలుగు సినిమా పుట్టినరోజు వేడుక..
– పరుచూరి గోపాలకృష్ణకు జెండా రూపకల్పన బాధ్యత
ఫిబ్రవరి 6వ తేదీని.. తెలుగు సినిమా పుట్టిన రోజుగా నిర్వహించాలని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్ణయించింది. ఇకపై ప్రతి యేడాది ఈ రోజును తెలుగు సినిమా పుట్టిన రోజుగా జరుపనున్నారు. ప్రభుత్వం అందించే అవార్డులతో పాటు, ఛాంబర్ తరఫు నుంచి వివిధ కేటగిరీల్లో అవార్డులు కూడా అందించనున్నారు. తెలుగు సినిమా పుట్టినరోజున ప్రతి సినిమా నటుడు ఇంటిపై, థియేటర్ల వద్ద ప్రత్యేకంగా జెండా ఆవిష్కరించాలని కూడా ఛాంబర్ నిర్ణయించింది. ఈ జెండా రూపకల్పన బాధ్యతను రచయిత పరిచూరి గోపాలకృష్ణకు అప్పగించింది.
తొలి తెలుగు టాకీ సినిమాకు సంబంధించి వివరాలను ఎంతో రీసెర్చ్ చేసి ‘భక్త ప్రహ్లాద’ గురించి తెలిపిన సీనియర్ జర్నలిస్ట్ రెంటాల జయదేవ కృషిని గుర్తు చేసుకుంటూ, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు భరత్ భూషణ్ ఆధ్వర్యంలో ఇదే వేదికపై ఆయన రచించిన ‘మన సినిమా ఫస్ట్ రీల్’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఛాంబర్ ప్రెసిడెంట్ దామోదర ప్రసాద్ మాట్లాడుతూ,’తెలుగు ఫిల్మ్ ఛాంబర్ తరఫున తెలుగు సినిమా దినోత్సవం మొదటిసారి చేయబోతున్నాం. సినిమా అనేది మా అందరికీ తల్లి లాంటిది. తెలుగు సినిమా ఛాంబర్ మదర్ బాడీ ఇక నుంచి ప్రతి సంవత్సరం చేయాలని డిసైడ్ చేశాం. మొదటి ఏడాది కాబట్టి ఈసారి నార్మల్‌గా చేస్తున్నాం. నెక్ట్స్ ఇయర్ నుంచి గ్రాండ్‌గా నిర్వహించబోతున్నాం. పాత తరం కళాకారులకు మరిన్ని సన్మానాలు చేస్తాం. ఈ రోజును గురించి పాతికేళ్ల పాటు రీసెర్చ్ చేసి మొదటి తెలుగు టాకీ సినిమా డేట్‌ను ఖచ్చితంగా గుర్తించి ప్రపంచానికి తెలియజేసిన సీనియర్ జర్నలిస్ట్ రెంటాల జయదేవ్‌కి థ్యాంక్స్ చెబుతున్నాను’ అని అన్నారు.
నటులు, నిర్మాత మురళీ మోహన్ మాట్లాడుతూ, ‘ఎప్పటి నుంచో చేసుకోవాల్సిన పండగ. ఇప్పటికైనా నిర్వహిస్తున్నందుకు సంతోషం. మనం గర్వంగా చెప్పుకోదగ్గ వ్యక్తుల్లో ఎల్వీ ప్రసాద్ ఆద్యుడు అని చెప్పాలి. ఆయనతో పాటు ఎందరున్నా.. ఎల్వీ ప్రసాద్ హిందీ, బెంగాలీ చిత్రాల్లోనూ నటించారు, దర్శకుడుగానూ రాణించి సినిమా స్థాయిని పెంచారు. సినీ నటులు ఎప్పుడు ప్రేక్షకుల హృదయాల్లో ఉంటారు. ఫిబ్రవరి 6న తెలుగు సినిమా దినోత్సవాన్ని జరుపుకోవడం ఆనందంగా ఉంది. మద్రాసులో ఉన్నప్పుడు మేం సినిమా కులమని గర్వంగా చెప్పుకునేవాళ్లం. అలాంటి సినిమాకు సంబంధించి ప్రతి సంవత్సరం పండగ చేసుకోవాలి. సినిమా పరిశ్రమలో అన్ని విభాగాల వాళ్లు సమన్వయం చేసుకుని నిర్వహిస్తే ఇంకా బావుంటుంది’ అని తెలిపారు.