లైంగిక వేధింపుల కేసులో హెచ్‌డి రేవణ్ణ, ప్రజ్వల్‌లకు వ్యతిరేకంగా సిట్‌ చార్జిషీట్‌

– ప్రజాప్రతినిధుల కోర్టులో సమర్పణ
బెంగళూరు : కర్నాటకలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో జేడీఎస్‌ ఎమ్మెల్యే హెచ్‌డి రేవణ్ణ, మాజీ ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణలపై నేర దర్యాప్తు విభాగానికి చెందిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) చార్జిషీట్‌ను దాఖలు చేసింది. ప్రజ్వల్‌కు వ్యతిరేకంగా నాలుగు కేసులను దర్యాప్తు చేస్తున్న సిట్‌.. 2000లకు పైగా పేజీల చార్జిషీట్‌లో దాదాపు 150 మంది సాక్షుల వాంగ్మూలాలు ఉన్నాయని వివరించింది. ఈ చార్జిషీట్‌ను సిట్‌.. ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టులో సమర్పించింది. చార్జిషీట్‌ను దాఖలు చేసే ముందు నిపుణుల అభిప్రాయాన్ని తీసుకున్నట్టు సిట్‌ వివరించింది. హెచ్‌డీ రేవణ్ణ, ఆయన కుమారుడు ప్రజ్వల్‌లపై భారతీయ శిక్షా స్మృతిలోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఈ లైంగిక వేధింపుల కేసు కర్నాటకను ఒక కుదుపు కుదిపింది. ముఖ్యంగా, జేడీఎస్‌తో పొత్తు పెట్టుకున్న బీజేపీకి ఒక పెద్ద తలనొప్పిగగా మారింది.
ఈ ఏడాదిలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో హస్సన్‌ పార్లమెంటు స్థానం నుంచి ఎన్డీఏ అభ్యర్థిగా పోటీ చేసిన ప్రజ్వల్‌ ఓటమిపాలయ్యాడు. అయితే, లోక్‌సభ రెండో దశ ఎన్నికల సమయంలో మహిళలపై ఆయన లైంగిక వేధింపులకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టటంతో ప్రజ్వల్‌ నెమ్మదిగా భారత్‌ నుంచి జారుకున్న విషయం విదితమే.