
ప్రజలు ముఖ్యంగా యువత గంజాయి, కొకైన్ వంటి మత్తు పదార్థాల బారిన పడకుండా ఉండాలని టేకులపల్లి సీఐ టి.సురేష్ సూచించారు. మావోయిస్టు వారోత్సవాల సందర్భంగా బుధవారం ఆయన మండల పరిధిలోని అనంతోగు, ముత్తాపురం గ్రామాల్లోని గుత్తికోయ ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గిరిజన ప్రాంతాల్లో అపరిచితులు ఎవరైనా సంచరిస్తే వెంటనే అటువంటి వ్యక్తుల సమాచారం పోలీసులకు ఇవ్వాలని కోరారు. యువత సన్మార్గంలో నడవాలన్నారు. విద్యార్థులు, నిరుద్యోగ యువత విద్యతో పాటు క్రీడల్లో సైతం రాణించి, ప్రభుత్వ ఉద్యోగాలు సాధించేందుకు కృషి చేయాలన్నారు. మానసిక రుగ్మతలకు లోనై క్షణికావేశంలో బలవన్మరణాలకు పాల్పడవద్దని, సమస్య ఎలాంటిదైనా బ్రతికి సాధించాలని, అవసరమైతే పోలీసుల సహాయం తీసుకోవాలని యువతకు సూచించారు. అదేవిధంగా గ్రామాల్లో విప్లవ సాహిత్యంతో అపరిచితులు తారసపడితే పోలీసుల దృష్టికి తేవాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక పోలీస్ స్టేషన్ ఎస్సై ఈ.రతీష్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.