– ఇథనాల్ కంపెనీ వ్యర్థాలతో పర్యావరణ విధ్వంసం
– నీరు, గాలి, భూమి సర్వం కాలుష్యమయం
– మూగజీవాల మృత్యువాత … ప్రజలకు ప్రాణాంతక వ్యాధులు
ఆ ఊరిలో అడుగు పెట్టడానికి కొద్దిదూరం నుంచే ముక్కు మూసుకోవాలి. కండ్లు మంటలు పుడతాయి. నీటిలో కాళ్లు పెట్టినా, నీళ్లు ముట్టుకున్నా దద్దుర్లు వస్తుంటాయి. నీళ్లు తాగిన మూగజీవాలు బతికే అవకాశం తక్కువ. గాలి, నీరు, భూమి సమస్తం కాలుష్యమయమై పర్యావరణ దెబ్బతింటోంది. నారాయణపేట జిల్లా మర్రికల్ మండల పరిధిలోని చిత్తనూరు, జిన్నారం, ఎక్లాస్‌పూర్ గ్రామాల పరిస్థితి ఇది. ఇథనాల్ కంపెనీతో జరుగుతున్న పర్యావరణ విధ్వంసంపై చిత్తనూరు వాసులు ఆందోళన చెందుతున్నారు. ఆ ప్రాంతాన్ని శనివారం నవతెలంగాణ సందర్శించింది. రాజకీయ నాయకులు హామీలు ఇవ్వడం తప్ప వారి సమస్యను పరిష్కరించడానికి ముందుకు రావడం లేదని నవతెలంగాణకు చెప్పుకుని వాపోయారు.
నవతెలంగాణ-మహబూబ్‌నగర్ ప్రాంతీయప్రతినిధి(పరిపూర్ణం)
ఇథనాల్ ఉత్పత్తి కొరకు కేంద్ర ప్రభుత్వం నారాయణపేట జిల్లా చిత్తనూరు గ్రామ సమీపాన రెండేండ్ల క్రితం ‘జూరాల ఆర్గానిక్ ఫార్మా అండ్ ఇండిస్టీస్’ పేరుతో ఇథనాల్ ఉత్పత్తి ఇండిస్టీని పెట్టడానికి అనుమతించింది. ఇథనాల్ ఇండిస్టీ పెట్టేందుకు మన్నెంవాగు చుట్టూ ఉన్న వరి పంట పండే భూములతో పాటు అసైన్డ్ భూములను సేకరించారు. అంతా కలిపి 480 ఎకరాల పంటభూములలో ఈ కంపెనీని పెట్టారు. చిత్తనూరు, జిన్నారం, ఎక్లాస్‌పూర్, పర్‌దీపూర్‌లోని 230 మంది రైతుల నుంచి పంటభూములను కంపెనీ యాజమాన్యం సేకరించింది. ఆధునిక వ్యవసాయం కోసం భూములు కొనుగోలు చేస్తున్నాం.. తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు వచ్చేవిధంగా పంటలు సాగు చేస్తాం. ఆధునిక వ్యవసాయం పట్ల అవగాహన పెరగడంతోపాటు రైతు కూలీలకు ఉపాధి లభిస్తుందంటూ తక్కువ ధరకు భూములు కొనుగోలు చేశారు. ప్రభుత్వ ప్రోత్సాహం కూడా ఉండడంతో రైతులు తమ భూములు అందజేశారు. పెట్రోల్, డీజిల్ తయారీ కోసం ఉపయోగించే లిక్విడ్‌ను ఇథనాల్ కంపెనీలో తయారు చేస్తున్నారు. ఈ కంపెనీకి ప్రతిరోజు 18 లక్షల కిలోల బియ్యం, 24 లక్షల లీటర్ల నీటిని వాడతారు. ఫలితంగా ప్రజలకు భూమి కొరతతో పాటు, నీటికొరత కూడా ఎదురవుతోంది. పైగా మొత్తం పర్యావరణం దెబ్బతిని జీవనమే కష్టమవుతోంది. నిబంధనలను కంపెనీ బేఖాతరు చేసింది. వ్యర్థాలను తగుల బెట్టాల్సిన యాజమాన్యం ఖాళీ ప్రదేశాల్లో పడేయటం, వాగులో కలపడంతో ఆ ప్రాంతమంతా విషతుల్యంగా మారింది. మొదట జీరో కాలుష్యమని చెప్పి ఇప్పుడు 100 శాతం కాలుష్యమయం చేస్తున్నారని గ్రామస్తులు తెలిపారు..
30 కిలోమీటర్ల మేర ప్రభావం
ఈ కంపెనీ నుంచి వచ్చే కాలుష్యం చుట్టూ 30 కిలోమీటర్ల వరకు ప్రభావం చూపుతోంది. మరికల్ నుంచి చిత్తనూరు ప్రధాన రహదారి గుండా వెళ్తుంటే కంపెనీ కాలుష్యానికి ముక్కు పుటాలు అదిరిపోతాయి. మన్నెవాగుతో పాటు సమీప చెరువులన్నీ విష జలాశయాలుగా మారాయి. ఈ కంపెనీ నుంచి వచ్చిన కాలుష్యం వల్ల మనుషులే కాదు,మూగ జీవాలు సైతం మృత్యువాత పడుతున్నాయి. మిషన్‌బగీరథ నీరు సైతం విషంగా మారుతోంది.
గ్రామాలకు కూలీలు ఎవ్వరూ… రావడం లేదు
ముఖ్యంగా చిత్తనూరు గ్రామంలో పొలం పనుల కోసం సమీప జిన్నారం, ఎక్లాస్‌పూర్ గ్రామాల నుండి ప్రతి రోజు రెండు వేల మందికి ఉపాధి లభించేది. ఇప్పుడు ఈ గ్రామం మొత్తం జల,వాయు కాలుష్యంగా మారింది. గ్రామస్తులు రోగాల బారిన పడటంతో ఈ గ్రామాలకు కూలీలు రావడం లేదు. దీంతో పొలం పనులు కుంటుబడుతున్నాయి. ఈ ప్రాంత ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడకపోగా తమ ప్రాణాలు హరిస్తున్న ఇథనాల్ కంపెనీని ఇక్కడి నుంచి తరలించాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు
అనర్థాలు అనేకం
ఇథనాల్ కంపెనీ వల్ల ప్రతి రోజూ 450 టన్నుల బొగ్గు పులుసు గాలిలో, నీటిలో కలుస్తోంది. కంపెనీ నుంచి వెలువడుతున్న కాలుష్యకారక రసాయనాలను మన్నెవాగులో కలుపుతున్నారు. నీరు కలుషితమై చేపలు చనిపోతున్నాయి. మూగ జీవాలు, పశువులు మృత్యువాతపడుతున్నాయి. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు రోగాల బారిన పడుతున్నారు. అస్తమా, చర్మ వ్యాధి, కంటి చూపు, కిడ్నీ, కాలేయం, ఊపిరితిత్తులకు ప్రమాదం వాటిల్తుతోంది. ఇక్కడ కంపెనీ ఏర్పాటు చేస్తే.. మాబతుకులు బాగు పడుతాయని అనుకున్నాం.కాని మా బతుకులు ఆగం ఆవుతాయని అనుకోలేదు.ముఖ్యంగా మ పశువులు, కోళ్లు, గొర్రెలకు సైతం గడ్డుకాలం వచ్చింది. విషం జిమ్మె కంపెనీపై చర్యలు తీసుకోవాలి. లేనిచో మాకు ప్రత్యమ్నాం చూపాలని పలువురు గ్రామస్తులు మొరపెట్టుకుంటున్నారు.
”మా కుమారుడు చరణ్ గ్రామ సమీపంలో ఉండే మన్నెవాగులో ఈత కొట్టడానికి పోయాడు. ఈ వాగులోకి ఇథనాల్ కంపెనీకి చెందిన కాలుష్యం నీరు వస్తుందని తెలియదు. స్నానం చేసి ఇంటికి రాగానే పెయ్యి అంతా బొగ్గలు పుట్టాయి. కండ్లు బైర్లు కమ్మాయి. చేతిలో చిల్లి గవ్వ లేకుంటే మా ఊరి సంఘం వాళ్ల సహకారంతో మహబూబ్‌నగర్ ఆస్పత్రికి తీసుకెళ్లాం. అక్కడ పట్టకుంటే హైదరాబాద్‌లోని నీలోపర్ ఆస్పత్రికి పోయార. వేలల్లో ఖర్చు అయ్యింది. కంపెనీ నుంచి ఏమాత్రం సహకారం లేదు.”
లొడ్డ ఆంజనేయులు ,చిత్తనూరు
”మా గొంతులు పట్టుకుపోతున్నాయి. ఇక్కడి గాలి పీలిస్తే… మాకు అంతులేని రోగాలు వస్తున్నాయి. ఇక్కడి నీరు సైతం విషతుల్యంగా మారింది. వాగులు, చెరువుల నీళ్లు తాగిన మూగ జీవాలు మృత్యువాత పడుతున్నాయి. గతంలో పదుల సంఖ్యలో గొర్రెలు, గేదెలు చనిపోయాయి. మన్నెవాగులో వదలిన చేపలు క్వింటాళ్ల కొద్ది చనిపోయాయి. ఇప్పుడా కంపెనీ తొలగించకపోతే మేము గ్రామాన్ని ఖాళీ చేయాల్సి వస్తోంది”
చింతలయ్య ,చిత్తనూరు గ్రామ యువక మండలి