
– గీట్ల ముకుంద రెడ్డి సీఐటీయూ అధ్యక్షులు
నవతెలంగాణ – కరీంనగర్
సీఐటీయూ 54వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షులు గీట్ల ముకుంద రెడ్డి మానకొండూరు మండలం సదాశివ పల్లి లో సీఐటీయూ పతాకావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ముకుంద రెడ్డి మాట్లాడుతూ… కార్మిక వర్గ హక్కులకై రాజీలేని పోరాటాలు నిర్వహించడానికి, రివిజనిస్ట్ పోకడలకు వ్యతిరేకంగా ఐక్యతా పోరాటం నినాదంగా 1970లో సీఐటీయూ ఆవిర్భవించిందన్నారు. అప్పటినుండి ఇప్పటివరకు కార్మికుల హక్కుల కోసం అనేక పోరాటాలు, సార్వత్రిక సమ్మెలు చేసిందన్నారు. జాతీయోద్యమ కాలం నుండి కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న అనేక చట్టాలను యజమానులకు అనుకూలంగా సవరణలు చేస్తూ నాలుగు లేబర్ కొడులను మోడీ సర్కార్ తీసుకొచ్చిందని, దీనికి వ్యతిరేకంగా కార్మిక వర్గం నిరంతరం పోరాడుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వ విధానాలకు భిన్నంగా ఏమీ లేదన్నారు. 15 సంవత్సరాలుగా సవరణకులకు నోచుకోని 73 షెడ్యూల్ పరిశ్రమల వేతనాల సవరణకు డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఈ ప్రభుత్వం ఇచ్చింది. కానీ వేతనం ఏమాత్రం పెంచకుండా బేసిక్, డిఏ కలిపి ఎంత అవుతుందో అంతే ఇచ్చి కార్మిక వర్గానికి తీవ్రమైన అన్యాయం చేస్తుందన్నారు. కష్టపడి పనిచేసే శ్రామికులకు ఇవ్వవలసిన దగ్గర సరియైన వేతనాలు ఇవ్వకుండా, అందుకు కావలసిన జీవోలు సవరణ చేయకుండా పేదలకు ఏదో సంక్షేమం చేస్తున్నట్టు పాలక పార్టీలు ఫోజులు పెడుతుంటాయి. ఆ సంక్షేమ పథకాలు కూడా ఉపయోగపడేది పరోక్షంగా యజమానులకే అని అన్నారు. కార్మిక వర్గ ఐక్యత, పోరాటల ద్వారానే అనేక సమస్యలు పరిష్కరించమని, విజయాలు సాధించామని రాబోయే కాలంలో కూడా కార్మిక వర్గం కులాలు, మతాలు, ప్రాంతాలకతీతంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ భద్రయ్య, చౌదరి సంపత్ గట్టు సతీష్, పోచయ్య, శ్రీనివాస్ ఎస్ రమేష్, వనం ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.