న్యూఢిల్లీ : కనీస మద్దతు ధరకు చట్టపరమైన హామీని కల్పించడంతో సహా తమ డిమాండ్ల సాధన కోసం చలో ఢిల్లీకి వెళుతున్న రైతులపై పంజాబ్, హర్యానా సరిహద్దుల్లో హర్యానా పోలీసులు దారుణంగా హింసాత్మక, అణచివేత చర్యలకు పాల్పడడాన్ని సీఐటీయూ, ఏఐకేఎస్‌లు తీవ్రంగా ఖండించాయి. రైతులపై బాష్పవాయు గోళాల ప్రయోగానికి డ్రోన్‌లను ఉపయోగించడం చూస్తుంటే ఈ దేశ రైతాంగంపై బీజేపీ ప్రభుత్వం ఎంత కక్షతో, ప్రతీకారంతో వుందో అర్ధమవుతోందని విమర్శించాయి. ఈ మేరకు సీఐటీయూ ప్రధాన కార్యదర్శి తపన్‌సేన్, ఏఐకేఎస్ అధ్యక్ష కార్యదర్శులు అశోక్ ధావలె, విజూ కృష్ణన్‌లు వేర్వేరుగా ప్రకటనలు జారీ చేశారు. నిరసన తెలియచేసే ప్రజాస్వామిక హక్కుపై ఇటువంటి దాడులకు పాల్పడితే పరిస్థితులు తీవ్రంగా మారతాయని హెచ్చరించారు. సంయుక్త కిసాన్ మోర్చా, ఇతర కేంద్ర కార్మిక సంఘాలతో కలిసి ఎఐకెఎస్ ఇటువంటి అణచివేత చర్యలను ప్రతిఘటిస్తుందని నేతలు హెచ్చరించారు. తక్షణమే అరెస్టు చేసిన నేతలందరినీ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సరిహద్దుల్లో రెండు పాయింట్ల వద్ద మంగళవారం రైతులపై దాడి జరిగింది. వారిపై లాఠీచార్జి చేయడంతో పాటూ బాష్పవాయు గోళాలను ప్రయోగించారు. రైతులతో అనేక దఫాలుగా చర్చలు జరిపిన తర్వాత కనీస మద్దతు ధరకు చట్టపరమైన హామీ కల్పించడం సాధ్యం కాదని కేంద్ర వ్యవసాయ మంత్రి అర్జున్ ముందా స్పష్టం చేశారు. కనీస మద్దతు ధరకు చట్టపరమైన హామీతో పాటూ స్వామినాథన్ కమిషన్ సిఫారసులను తక్షణమే అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వ కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలను తీవ్రంగా నిరసిస్తూ ఎస్కేఎం, సీఐటీయూలు నిరంతరంగా పోరాటాలు జరుపుతునే వున్నాయని పేర్కొంది. అన్ని రంగాల్లో మోడీ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని విమర్శించారు. ప్రజాస్వామ్యంపై, భార రాజ్యాంగంపై జరుగుతున్న దాడులను, విషపూరితమైన మతోన్మాద దాడులను ప్రతిఘటించాల్సిందిగా సమాజంలోని అన్ని వర్గాలకు పిలుపిచ్చారు.