అంగన్ వాడి కార్మికుల సమస్యలను పరిష్కరించాలి: సీఐటీయూ దేవగంగు

నవతెలంగాణ – భీంగల్
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడి కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించి 26 వేల రూపాయల వేతనాన్ని అందించాలని సిఐటియు జిల్లా అధ్యక్షురాలు కైరి దేవగంగు  కోరారు. వామపక్షాల ఆధ్వర్యంలో శుక్రవారం చేపట్టిన దేశవ్యాప్త సమ్మెలో భాగంగా పట్టణ కేంద్రంలోని ఐసిడిఎస్ కార్యాలయం ముందు అంగన్వాడీ కార్యకర్తలు సమ్మెలో కూర్చున్నారు. అనంతరం ర్యాలీగా వెళ్లి బడా భీంగల్ చౌరస్తా వద్ద మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా దేవగంగు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అంగన్వాడి  సెంటర్ల పై చిన్న చూపు చూస్తుందని  దీంట్లో భాగంగానే గడిచిన 10 సంవత్సరాలలో  అంగన్వాడి విద్యకు 60 శాతం  బడ్జెట్  ను తక్కువ చేసిందని అన్నారు. ఇలా చేయడం వలన అంగన్వాడీ విద్య బలహీన పడుతుందని కనుక ఇప్పటికైనా తేరుకొని అంగన్వాడి సమస్యలను పరిష్కరించి కార్మికులకు 26 వేల రూపాయల వేతనాన్ని అందించాలన్నారు.  గ్రామపంచాయతీలలో పనిచేస్తున్న కార్రోబర్లు కూడా సమ్మె చేపట్టారు కారోబార్లను పర్మినెంట్ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని మండల అధ్యక్షుడు బాలయ్య ప్రభుత్వాలను కోరారు. ఈ సమ్మెలో అంగన్వాడి నాయకులు ప్రమీల, గంగా లక్ష్మి ,యమునా తోపాటు కార్మికులు మరియు గ్రామపంచాయతీ కరోబార్లు పాల్గొన్నారు.