
తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్, సీఐటీయూ యూనియన్ కమిటీ ఆధ్వర్యంలో సీఐటీయూ 54వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. గురువారం వేములవాడ పురపాలక సంఘం కార్యాలయం ముందు జెండా ఆవిష్కరణను రాష్ట్ర ఉపాధ్యక్షులు గుర్రం అశోక్, యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పందుల మల్లేష్ లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు గుర్రం అశోక్ మాట్లాడుతూ సీఐటీయూ కలకత్తా నగరంలో 1970 మే 3 నాడు ఏర్పడిందని నాటి నుండి నేటి వరకు ఐక్యత పోరాటం ద్వారా కార్మికుల హక్కుల సాధన కోసం ముందు వరుసలో నిలబడి దేశవ్యాప్త సమ్మెలో 22 సార్లు పాల్గొని సీఐటీయూ ముఖ్యపాత్ర పోషించిందని అన్నారు. రాష్ట్రంలోనైనా, దేశంలోనైనా కార్మికుల సమస్యలు పై పరిష్కార దిశగా అడుగులు వేస్తున్న సీఐటీయూ అండదండలు ఎల్లప్పుడూ కార్మికులకు అనుకూలంగా ఉంటాయని చెప్పారు.జ్యోతి బసు, పుచ్చలపల్లి సుందరయ్య, బిటి రణధీవే, ఎంకే పాంధే లాంటి పోరాట యోధులు సీఐటీయూకు నాయకత్వం వహించారని తెలిపారు. పాలకవర్గాలపై పోరాడి కార్మిక హక్కులు సాధించడంలో సీఐటీయూ ముందుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎండి సినారుద్దీన్, రేగుల శ్రీధర్, ఉప్పర శంకర్, గాజుల వజ్రమ్మ, పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొన్నారు.