మహీంద్రాలో సీఐటీయూ హ్యాట్రిక్‌

– మూడోసారి ఘన విజయంతో చరిత్ర తిరగరాసిన సీఐటీయూ
– ఆనందంలో మునిగితేలిన మహేంద్ర కార్మికులు
– ఈ విజయం కార్మికులదే : యూనియన్‌ అధ్యక్షులు చుక్క రాములు
నవ తెలంగాణ జహీరాబాద్‌
మహేంద్ర పరిశ్రమలో సీఐటీయూ మూడోసారి ఘనవిజయం సాధించింది. పరిశ్రమలో చరిత్రను తిరగరాసిన ఘనత చుక్క రాములకే దక్కుతుంది. గురువారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ పట్టణంలోని మహేంద్ర అండ్‌ మహేంద్ర పరిశ్రమలో కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపించాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా టీఎంఎస్‌ అభ్యర్థి గెలుపు కోసం మంత్రి హరీశ్‌రావు, ఎంపీ బీబీ పాటిల్‌, ఎమ్మెల్యే మాణిక్‌ రావు అనేక విధాలా ప్రయత్నాలు చేశారు. ఎమ్మెల్యే మాణిక్యరావు గేట్‌ మీటింగ్‌లో పాల్గొని ప్రభుత్వపరంగా కార్మికులను అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అయినా.. మహేంద్ర కార్మికులు తమ ఉద్యోగ భద్రత, తమ పిల్లలకు ఉద్యోగాలు, మెరుగైన వేతన ఒప్పందం కోసం మూడోసారి సీఐటీయూ అభ్యర్థి చుక్క రాములను గెలిపించారు. పరిశ్రమలో మొత్తం 585 ఓట్లు ఉండగా అందులో నలుగురు కార్మికులు ఇతర పరిశ్రమల్లో డిప్య్రూటేషన్‌పై వెళ్లగా ఒక కార్మికుడు అనారోగ్యం కారణంగా వైద్యశాలలో చేరాడు. గురువారం జరిగిన ఎన్నికల్లో 580 ఓట్లు పోలవ్వగా సీఐటీయూ అభ్యర్థి చుక్క రాములకు 296 ఓట్లు రాగా ప్రత్యర్థి ఐఎన్టీయూసీ అభ్యర్థి రాములు యాదవ్‌కు 285 ఓట్లు వచ్చాయి. దాంతో 11 ఓట్ల మెజారిటీతో చుక్క రాములు మూడోసారి ఘనవిజయం సాధించారు. ఈ సందర్భంగా పరిశ్రమ గేటు ముందు భారీ సంఖ్యలో బాణాసంచా పేల్చి జూనియర్‌, సీనియర్‌ కార్మికులతో పాటు కాంట్రాక్టు కార్మికులు నృత్యాలు చేశారు. అనంతరం ప్రధాన గేటు నుంచి టెక్నీషియన్స్‌ కాలనీ వరకు భారీ ఊరేగింపు నిర్వహించారు.
యూనియన్‌ ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి అధ్యక్షతన జరిగిన విజయోత్సవ ర్యాలీలో చుక్క రాములు మాట్లాడుతూ.. ఈ విజయం కార్మికులకే చెందుతుందన్నారు. తమ ప్రత్యర్థులు రకరకాల ప్రలోభాలకు గురి చేసినా లొంగకుండా సీఐటీయూని గెలిపించడం హర్షించదగ్గ విషయమని తెలిపారు. కార్మికులు ఏ నమ్మకంతోనైతే గెలిపించారో వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా వారి బంగారు భవిష్యత్తుకు మరెన్నో సంక్షేమ పథకాలు తీసుకువచ్చేందుకు కృషి చేస్తామని అన్నారు. గతంలో సుదీర్ఘంగా పాలించిన ఆయా యూనియన్లు తాకట్టు పెట్టిన వివిధ కార్మిక సంక్షేమ ఫలాలన్నింటినీ రెండు పర్యాయాలుగా దశలవారీగా సాధించి కార్మికులకు శాయశక్తులా లాభం చేకూర్చామని తెలిపారు. పరిశ్రమలో ఇదివరకే ఉద్యోగం పొంది విధులు నిర్వహిస్తున్నటువంటి సీనియర్‌ కార్మికుల పిల్లలు పదవ తరగతి పాస్‌ అయితే వారికి ట్రైనింగ్‌ ఇప్పించి మహేంద్ర పరిశ్రమలో నేరుగా ఉద్యోగం ఇప్పించిన ఘనత కూడా తమకే దక్కుతుందని అన్నారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షులు బీరం మల్లేశం మాట్లాడుతూ సీఐటీయూని భారీ మెజారిటీతో గెలిపించినందుకు కార్మికులకు కృతజ్ఞతలు తెలిపారు. విజయోత్సవ ర్యాలీలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు రామచందర్‌ సీఐటీయూ నాయకులు మహిపాల్‌, పిరమిల్‌ పరిశ్రమ నాయకులు నరసయ్య, ప్రభు, మహేంద్ర పరిశ్రమ నాయకులు కనకారెడ్డి, వీరయ్య గౌడ్‌, యూసుఫ్‌, బీపీసీ శేఖర్‌, అంజయ్య, రాములు, కిషన్‌, శ్రీకాంత్‌, తదితరులు పాల్గొన్నారు.
కార్మికులదే గెలుపు : సీఐటీయూ
మహీంద్రా అండ్‌ మహీంద్రా పరిశ్రమలో సీఐటీయూ గెలుపు ముమ్మాటికీ కార్మికులదేనని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చుక్కరాములు, పాలడుగు భాస్కర్‌ పేర్కొన్నారు. సీఐటీయూని గెలిపించిన కార్మికులందరికీ ధన్యవాదాలు తెలిపారు. గురువారం ఈ మేరకు వారు ఒక ప్రకటన విడుదల చేశారు. టీఆర్‌ఎస్‌కేవీకి ప్రభుత్వం అండదండలు అందించినా, లక్షల రూపాయలు ఖర్చుపెట్టినా కార్మికులు సీఐటీయూ పక్షాన నిలబడటం మంచి పరిణామమని పేర్కొన్నారు. కంపెనీలో తమ హక్కుల కోసం సీఐటీయూ నికరంగా పోరాడుతున్నది కాబట్టే సీఐటీయూకి వరుసగా మూడోసారి కార్మికులు పట్టం కట్టారని తెలిపారు. భవిష్యత్‌ పోరాటాలకు ఈ విజయం ఎంతో దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నాలుగు కార్మిక కోడ్‌లతో కార్మికుల హక్కులను హరిస్తున్నదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏమో కనీస వేతనాలకు గెజిట్‌ విడుదల చేయకుండా కంపెనీ యాజమాన్యాల ప్రయోజనాల కోసం పనిచేస్తున్న తీరును ఎండగట్టారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలపై కార్మికులు ఐక్య పోరాటాల్లో కలిసి రావాలని పిలుపునిచ్చారు.