వేతన బకాయిలను వెంటనే చెల్లించాలి : సీఐటీయూ

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
హైదరాబాద్‌ రైల్వే స్టేషన్‌లోని కాంటాక్ట్‌ కార్మికులకు రెండు నెలల వేతన బకాయిలను వెంటనే చెల్లించాలని హైదరాబాద్‌ రైల్వే కాంట్రాక్ట్‌ వర్కర్స్‌ యూనియన్‌ (సీఐటీయూ) అధ్యక్షులు ఎం వెంకటేశ్‌ డిమాండ్‌ చేశారు. గురువారం హైదరాబాద్‌ రైల్వే స్టేషన్‌ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ సౌత్‌ సెంట్రల్‌ రైల్వే సికింద్రాబాద్‌ డివిజన్‌ పరిధిలోని హైదరాబాద్‌ రైల్వే స్టేషన్‌లో పనిచేస్తున్న హౌస్‌ కీపింగ్‌ కాంట్రాక్ట్‌ కార్మికులకు రెండు నెలల నుంచి వేతనాలు ఇవ్వటం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి నెలా ఏడో తేదీ లోపు జీతాలివ్వాలని చట్ట నిబంధనలున్నా.. కాంట్రాక్టర్‌, రైల్వే యాజమాన్యం పట్టించుకోవడంలేదని విమర్శించారు. జీతాలు సమయానికి రాకపోవడం మూలంగా కార్మికులు ఇంటి కిరాయిలు, స్కూల్‌ ఫీజులు చెల్లించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. నిత్యావసర సరుకులు కూడా కొనలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డ్యూటీకి రావటానికి కూడా బస్సు చార్జీలు పెట్టలేని దుస్ధితి ఉన్నదని ఆవేదన వ్యక్తం చేశారు. నెలంతా కష్టపడి పని చేసి జీతాల కోసం అడుక్కోవటమేంటని ప్రశ్నించారు. గతంలో హైదరాబాద్‌ రైల్వే స్టేషన్‌లో 150 మంది పని చేసేవారనీ, ఇప్పుడు కేవలం 60 మందితో పని చేయిస్తూ కార్మికుల శ్రమను యాజమాన్యం దోచుకుంటుందని విమర్శించారు. పని భారం పెరగటం తో కార్మికులు అనేక రోగాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా యాజమాన్యం, కాంట్రాక్టర్‌ స్పందించి రెండు నెలల బకాయి వేతనాలు ఒకేసారి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ప్రతినెల ఏడో తేదీ లోపు జీతాలు చెల్లించాలనీ, పని భారం తగ్గించాలనీ, కార్మికులకు పే స్లిప్స్‌ ఇవ్వాలనీ, వేధింపులు ఆపాలని డిమాండ్‌ చేశారు. లేనట్లయితే.. రాబోయే కాలంలో పోరాటాలు చేస్తామని హెచ్చరించారు.కార్యక్రమంలో సీఐటీయూ నాంపల్లి జోన్‌ కన్వీనర్‌ సి. మల్లేష్‌, హైదరాబాద్‌ రైల్వే కాంటాక్ట్‌ వర్కర్స్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి ఏ. శాంతులు గౌడ్‌, నాయకులు కవిత, సాజిదా, హైమ, శైలజ తదితరులు పాల్గొన్నారు.