నారాయణపేటటౌన్: అంగన్వాడీ ఉద్యోగులను దొంగలుగా చిత్రీకరిస్తూ అంగన్వాడీ కేంద్రాల్లో సీసీ కెమెరాలు, బయోమెట్రిక్ పెట్టాలని ప్రభుత్వ నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జీ.వెంకట్రామా రెడ్డి, బాల్‌రాం డిమాండ్ చేశారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని మున్సిపల్ పార్క్ ఎదుట అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా శిబిరానికి సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్య దర్శులు హాజరై మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలకు ఒక్క పూట బడితో పాటు, మే నెల టీచర్లకు, హెల్పర్లకు సెల వులు ఇవ్వాలని, 24 రోజుల సమ్మె హామీలను వెంటనే అమ లు చేయాలని, హేల్పర్లను పాత పద్దతిలోనే ప్రమోషన్ సౌక ర్యం కల్పించాలని అన్నారు. ఈ ధర్నాకు అంగన్‌వాడీ టీచర్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అద్యక్షులు శశికళ అధ్య క్షత వహించారు. మార్చి 2వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టికహారం దుర్వినియోగం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని,అందుకోసం అంగన్వాడీ కేంద్రాల్లో సీసీ కెమెరాలు, బయోమెట్రిక్ విధానాన్ని ప్రవేశ పెట్టాలని అధికారులను ఆదేశించారు. అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్‌లను దొంగలుగా ఆరోపించడం తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఐసీడీఎస్ కు బడ్జెట్ పెంచి ఎలా బలోపేతం చేయాలని అంశాలు సమావేశంలో చర్చించ లేదని, 48 సం.గా విధులు నిర్వహిస్తున్న అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ ఎదుర్కొంటున్న సమస్యలు వాటి పరిష్కారం కోసం తీసుకున్న చర్యలు సమావేశంలో చర్చించలేదని, వీటన్నిటిని పక్కనపెట్టి పేద ప్రజల కోసం నిరంతరం సేవలందిస్తున్న అంగన్వాడీి టీచర్స్, హెల్పర్ లను అవినీతిపరులని ఆరోపించడం అన్యాయం, ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం తక్షణమే వెనక్కి తీసుకోవాలన్నారు. గతం లో 24 రోజుల సమ్మె సందర్భంగా అంగన్వాడీి ఉద్యోగులు మిగిలిన సమస్యలతో పాటు వేసవి కాలంలో ప్రభుత్వ పాఠశాలతో పాటు సమానంగా అంగన్వాడీ కేంద్రాలకు ఒకపూట బడితో పాటు మే నెల అంగన్వాడి టీచర్స్ హెల్పర్స్ కు ఒకేసారి సెలవులు ఇవ్వాలని కోరారు. సమ్మె అనంతరం ఈ సమస్య పైన పరిశీలించి పరిష్కారం చేస్తామని గత ప్రభుత్వం మంత్రులు హామీ ఇచ్చారు. ఆ అంశాలను కొత్త ప్రభుత్వానికి సంబంధిత మంత్రి అధికారులకు అనేకసార్లు తెలియ జేశామని, ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కారం చేయలేదని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆన్లైన్ కుటుంబ సర్వే చేయాలని అధికారులు చెబుతున్నారన్నారు. ఆ పనికి ఆటంకంగా ఉన్న అంశాలు పరిశీలించాలని కోరారు. అంగన్వాడీి టీచర్లకు సెల్ ఫోన్లు ఇచ్చి చాలా సంవత్సరాలు అవుతుందని, అవి పని చేయడం లేదని, స్టోరేజ్ ఫుల్ అయిందని, 24 గంటలు ఆన్‌లైన్ పని చిన్న ఫోన్ లో చేయడం వల్ల కంటి సమస్యలు పెరిగి కండ్లు కనపడకుండా అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆన్‌లైన్ పని కోసం ఫైవ్ జి డాటా టెక్నాలజీ తో కొత్త ట్యాబ్ ఇవ్వాలని, ఆన్‌లైన్ పనికి వేతనం పెట్టే షరుతులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెంచుతామని, రెండో పీఆర్సీ లో ఐదు శాతం ఐ ఆర్, మినీ సెంటర్లను మెయిన్ సెంటర్గా అప్డేట్ చేస్తామని జీవో ఇస్తామని, సమ్మె కాలపు వేతనాలు, ప్రమాద బీమా,మే నెల సెలవులు ,ఆన్లైన్ ఒకే యాప్ ఉండే విధంగా చూస్తామని మిగిలిన సమస్యలు పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చిందని, ప్రస్తుత ప్రభుత్వం ఆ హామీ వెంటనే నెరవేర్చాలని కోరారు. అనంతరం వివిధ డిమాండ్ల తో కూడిన వినతిపత్రాన్ని ధర్నా శిబిరం దగ్గరకు వచ్చిన తహసీల్దార్ రాణా ప్రతాప్ సింగ్‌కు అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గోపాల్, తెలంగాణ రైతుసంఘం జిల్లా కార్యదర్శి అంజిలయ్య గౌడ్ , సీఐటీయూ జిల్లా నాయకులు గోవింద్‌రాజ్ , జోషి , అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రసంగించారు. కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్ నాయకులు మంజల,పుష్ప, వరలక్ష్మి, భారతి, ప్రసూన, చంద్రకళ, ఉమా మహేశ్వరి, నారాయణమ్మ లక్ష్మి,,శారద, సుజాత, పద్మ, సువర్ణ, రాణి, శారద,వాణి, కవిత, డి.విజయలక్ష్మి, రామేశ్వరి, లక్ష్మి, యశోద, శ్రీలత, వెంకటమ్మ, రాధిక, ఎం. జయమ్మ వివిధ మండలాల అంగన్వాడీలు, హెల్పర్లు పాల్గొన్నారు.