రాష్ట్రంలోని కార్మికుల సమస్యలు పరిష్కరించాలి : సీఐటీయూ

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్రంలో వివిధ రంగాల కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సీఐటీయూ డిమాండ్‌ చేసింది. సోమవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన ఆ యూనియన్‌ వర్కింట్‌ కమిటీ సమావేశంలో దీనిపై ప్రత్యేకంగా తీర్మానం చేసింది. సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్కరాములు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్‌ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. అందులో ఆ యూనియన్‌ జాతీయ కోశాధికారి ఎం.సాయిబాబు, ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌ , ఆఫీస్‌ బేరర్లు, వర్కింగ్‌ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ‘కనీస వేతనాలు, మల్టీపర్పస్‌ విధానం రద్దు, కారోబార్లు, బిల్‌కలెక్టర్లకు ప్రమోషన్లు, తదితర డిమాండ్లతో రాష్ట్రంలోని 12,769 గ్రామాల్లో 50వేల మంది పంచాయతీ కార్మికులు సమ్మెలో ఉన్నారు. ప్రభుత్వం విచ్ఛిన్న ధోరణితో వ్యవహరిస్తున్నది. జేఏసీ నాయకులతో చర్చించి కార్మికుల సమస్యలను పరిష్కరించాలి’ అని డిమాండ్‌ చేసింది.
‘ఆర్టీసీ ఉద్యోగులకు వేతన సవరణ చేయాలి. యూనియన్లను అనుమతించాలి. పీఎఫ్‌ బకాయిలు, సీసీఎస్‌ నిధులను విడుదల చేయాలి’ అని సీఐటీయూ కోరింది. ‘రాష్ట్రంలో 17,965 మంది ఐకేపీ వీఓఏలు రూ.3,900 వేతనంతో వెట్టి చేస్తు న్నారు. వారి డిమాండ్లను నెరవేర్చాలి’ అని విజ్ఞప్తి చేసింది. ‘సింగరేణిలో తక్షణమే ఎన్నికలు నిర్వహిం చాలి. సంస్థలో బ్లాకుల ప్రయివేటీకరణను ఆపాలి. రూ.20వేల కోట్ల బకాయిలను వెంటనే ఇవ్వాలి. సొంత ఇంటి కల నెరవేర్చాలి. సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు జీవో నెం 22ను గెజిట్‌ చేసి వేతనం పెంచాలి. 2022 సెప్టెంబర్‌ 26న జరిగిన ఒప్పం దాన్ని సింగరేణి యాజమాన్యం అమలు చేయాలి’ అని కోరింది. ‘మధ్యాహ్న భోజన కార్మికులు, అంగన్‌ వాడీల సమస్యలను పరిష్కరించాలి. వివిధ పనులు, రిపోర్టుల పేరిట వేధింపులు, మెమోలు ఆపాలి. ఆశాలు కోరుతున్నట్లుగా ఫిక్స్‌డ్‌ వేతనం ఇవ్వాలి. అర్హులకు ఏఎన్‌ఎమ్‌లుగా ప్రమోషన్లు కల్పించాలి’ అని రాష్ట్ర ప్రభుత్వాన్ని సీఐటీయూ కోరింది.
‘రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్‌సీ ఇవ్వాలి. ప్రమోషన్లు, బదిలీలు, హెల్త్‌ కార్డులు, ఇతర సమస్యలు పెండింగ్‌ సమస్యలను పరిష్కరించాలి. కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను రెగ్యులర్‌ చేయడంలేదు. 5,000 మందిని మాత్రమే పర్మి నెంట్‌ చేసి చేతులు దులుపుకున్నది. వైద్య రంగంలో 5వేల మంది కాంట్రాక్టు ఎఎన్‌ఎంలు రెగ్యులర్‌ కాలేదు. 104, 108, 102, ఆరోగ్యశ్రీ, టి సాక్స్‌, అర్బన్‌ హెల్త్‌ ఉద్యోగులు నిరాశలో ఉన్నారు. పర్మి నెంట్‌, వేతనాల పెంపు దల కావాలని కోరుతు న్నారు. వారందరి సమ స్యలను పరిష్క రించాలి’ అని విజ్ఞప్తి చేసింది. ‘రాష్ట్రంలో కోటి మంది కార్మికులకు ప్రయోజనం కలిగించే 73 షెడ్యూల్డ్‌ ఎంప్లాయి మెంట్స్‌లో కనీస వేతనాలను సవ రించాలి’ అని డిమాండ్‌ చేసింది. ‘యూనివర్సిటీ ఉద్యోగులకు టైంస్కేల్‌ ఇవ్వడంలేదు. వారిని పర్మినెంట్‌ చేయాలి. పశుమిత్రలను కార్మికులుగా గుర్తించి హక్కులు కల్పించాలి’ అని కోరింది. ఎన్‌టిపిసిలో కాంట్రాక్ట్‌ కార్మికుల వేతనాలు పెంచాలని డిమాండ్‌ చేసింది. రాష్ట్రంలో పనిచేస్తున్న స్కూల్‌ స్వీపర్లకు కూడా వేతనాలు పెంచాలి. బీడీ కార్మికులకు కనీస వేతన జీవో అమలు చేయాలి. 26 రోజులు పని కల్పించాలి’ అని విజ్ఞప్తి చేసింది.