సమగ్ర శిక్షా అభియాన్‌ కాంట్రాక్ట్‌ ఉద్యోగుల సమ్మెకు మద్దతు : సీఐటీయూ

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
సమగ్ర శిక్షా అభియాన్‌ కాంట్రాక్టు ఉద్యోగుల నిరవధిక సమ్మెకు సీఐటీయూ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. మంగళవారం ఈ మేరకు ఆ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చుక్కరాములు, పాలడుగు భాస్కర్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో 20 ఏండ్ల నుంచి సర్వశిక్షా అభియాన్‌లో పనిచేస్తున్న వారిని పర్మినెంట్‌ చేయకపోవడం సబబు కాదని పేర్కొన్నారు. విద్యా శాఖలో కొన్ని విభాగాల్లోని టీచింగ్‌ సిబ్బందిని రెగ్యులర్‌ చేసినప్పటికీ ఈ ఉద్యోగుల పట్ల వివక్ష చూపడం అన్యాయమని తెలిపారు.
22 వేల మంది సమగ్ర శిక్షా ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాలనీ, అప్పటివరకు కనీస వేతన స్కేలును తక్షణం అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. వారికి రూ.10 లక్షల జీవిత బీమా, రూ.5 లక్షల ఆరోగ్య బీమా కల్పించాలని కోరారు. విద్యా శాఖ నియామకాల్లో 30 శాతం వెయిటేజి కల్పించాలని విన్నవించారు.
వారి న్యాయమైన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికైనా కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌పై రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో తగు నిర్ణయం చేయాలని కోరారు.