– నేడు మండల కేంద్రాల్లో సంఘీభావ ప్రదర్శనలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
గ్రామపంచాయతీ కార్మికులు, ఉద్యోగులు చేస్తున్న సమ్మెకు సీఐటీయూ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. వారికి సంఘీభావంగా మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా సంఘీభావ ప్రదర్శనలు చేయాలని కార్మికులకు పిలుపునిచ్చింది. సోమవారం ఈ మేరకు సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్కరాములు, ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ ఒక ప్రకటన విడుదల చేశారు.
రాష్ట్రంలోని 12,769 పంచాయతీల్లో 50 వేల మంది పారిశుద్ధ్య కార్మికులు, స్వీపర్లు, పంప్ ఆపరేటర్లు, ఎలక్ట్రీషియన్లు, డ్రైవర్లు, కారోబార్లు, బిల్ కలెక్టర్లుగా పనిచేస్తున్నారని తెలిపారు. వారిలో అత్యధికులు దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలేననీ, 20-30 ఏండ్ల నుంచి పనులు చేస్తున్నప్పటికీ వారి పనికి గుర్తింపు, పని భద్రత, కనీస వేతనాలు, పీఎఫ్, ఈఎస్‌ఐ, ప్రమాద బీమా లాంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలేవీ అమలు కావడం లేదని పేర్కొన్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జూలై ఆరో తేదీ నుంచి జీపీ ఉద్యోగ, కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో కార్మికులు నిరవధిక సమ్మెలోకి వెళ్లిన విషయాన్ని గుర్తుచేశారు. వారి పోరాటాన్ని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం దుర్మార్గమని తెలిపారు. మున్సిపల్ కార్మికులకు ఇస్తున్నట్టుగానే జీవో నెం.60 ప్రకారం రూ.15,600 వేతనాన్ని అమలు చేయాలనీ, జీఓ నెం.51ని సవరించి మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కారోబార్, బిల్ కలెక్టర్లకు ప్రత్యేక హోదా కల్పించి సహాయ కార్యదర్శులుగా నియమించాలని కోరారు. నెలల తరబడి పెండింగ్‌లో ఉన్న జీతాలను విడుదల చేయాలనీ, ఇతర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్మికులపై వేధింపులను ఆపాలని కోరారు.
మల్టీపర్పస్ విధానంతో నైపుణ్యం లేని పనులు చేస్తూ కార్మికులు తమ ప్రాణాలను కోల్పోతున్న తీరును వివరించారు. ప్రమాదంలో మరణించిన కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం, నష్టపరిహారం లాంటివి కూడా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదని విమర్శించారు. ప్రతి ఉద్యోగి, కార్మికునికి రూ.399 కేంద్ర ప్రభుత్వ తపాల బీమా ప్రీమియంతో ప్రభుత్వమే రూ.10 లక్షల ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని కోరారు. గ్రామ పంచాయతీ ఉద్యోగ,కార్మిక సంఘాల జేఏసీతో రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చర్చలు జరపాలని విజ్ఞప్తి చేశారు.