నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
పెరిగిన రేట్లకు అనుగుణంగా ఏరియర్స్ చెల్లించాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా సివిల్ సప్లరు, జీసీసీ హమాలీ కార్మికుల సమ్మెకు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్టు సీఐటీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చుక్కరాములు, పాలడుగు భాస్కర్ ప్రకటించారు. సీఐటీయూ అనుబంధ సంఘాలన్నీ సమ్మెకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. శుక్రవారం ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సివిల్ సప్లరు, జీసీసీ హమాలీ కార్మికుల ఎగుమతి-దిగుమతి రేట్ల ఒప్పందం 2023 డిసెంబర్‌తో ముగిసిందని తెలిపారు. హమాలీ కార్మిక సంఘాల పోరాటాలు, విన్నపాలతో గత అక్టోబర్ 3న ఎగుమతి, దిగుమతి రేట్లను ప్రస్తుతమున్న రూ.26 నుంచి రూ.29కి ప్రభుత్వం పెంచిందని తెలిపారు. పెరిగిన రేట్లను 2024 జనవరి నుంచి అమలు చేస్తామని ఏరియర్స్‌తో సహా చెల్లిస్తామనీ, మహిళా స్వీపర్లకు గోదాముల సామర్థ్యాన్ని బట్టి ప్రస్తుతం చెల్లిస్తున్న వేతనాలపై రూ.వెయ్యి పెంచారని పేర్కొన్నారు. బోనస్‌ను రూ.7,500కు, డ్రెస్ కుట్టుకూలి చార్జీలను రూ.1,300 నుంచి రూ.1,600కి, దసరా పండుగ స్వీట్ బాక్స్‌కు రూ.900 ఇస్తామని నిర్ణయించినట్టు తెలిపారు. సివిల్ సప్లరు, హమాలీల వలే జీసీసీ హమాలీలకు పీఎఫ్ సౌకర్యం కల్పిస్తామని ఇతర సమస్యలను పరిష్కరిస్తామని కమిషనర్ హామీ ఇచ్చారని గుర్తుచేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంతోనే తప్పనిసరి పరిస్థితుల్లో వారు సమ్మెలోకి వెళ్లారని తెలిపారు. ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని వారి సమస్యలను పరిష్కరించి సమ్మెను నివారించాలని కోరారు.