
పారిశ్రామిక కార్మికులు,ట్రాన్స్పోర్ట్, షాపుల్లో పనిచేసే కార్మికులు తో పాటు వివిధ రకాల కార్మికులకు పెరిగిన ధరలకు తగ్గట్లు కనీస వేతనాలు పెంచాలని 2021 జూన్ లో ఇచ్చిన ఐదు రంగాలను గెజిట్ చేయాలని సీఐటియూ జిల్లా ఉపాధ్యక్షుడు పిట్టల అర్జున్ డిమాండ్ చేశారు. శనివారం సీఐటీయూ రాష్ట్ర వ్యాప్త క్యాంపెయిన్ లో భాగంగా లేబర్ డిపార్ట్మెంట్ ను సవరణలు కోరుతూ కార్మికుల్లో కరపత్రం ప్రచారం సంతకాలు సేకరించారు. ఈ సందర్భంగా ఆటో అడ్డా, హమాలీ అడ్డాల వద్ద జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ఆద్వర్యంలో, సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత జనవరిలో జారీ చేసిన కనీస వేతనాల ప్రాథమిక నోటిఫికేషన్లు కార్మికుల వేతనాలు పెరిగిన ధరలకు అనుగుణంగా లేవని అన్నారు. కార్మికుల కనీసం అవసరాలు పరిగణలోకి తీసుకోలేదని అన్నారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం 2018 లో ఫ్లోర్ లెవెల్ మినిమం రూ.178 లు చొప్పున నెలకు రూ. 4,628 లు మాత్రమే పెంచడం తీవ్ర అన్యాయమని అన్నారు. ఆక్ట్రాయిడ్ ఫార్ములా, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం శాస్త్రీయంగా కనీస వేతనం నిర్ణయించి పెరిగిన ధరలు ఆధారంగా రూ. 26 వేలకు తగ్గకుండా నిర్ణయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో హమాలీ యూనియన్ నాయకులు నాగేంద్ర,రమేష్,ఖాసిం, రాంబాబు,ముత్తు,అనిల్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.