సిటీ యూనియన్‌ బ్యాంక్‌కు రూ.218 కోట్ల లాభాలు

హైదరాబాద్‌ : ప్రయివేటు రంగంలోని సిటీ యూనియన్‌ బ్యాంక్‌ (సీయూబీ) గడిచిన ఆర్థిక సంవత్సరం (2022-23)లో మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికం (క్యూ4)లో 4.4 శాతం వృద్ధితో రూ.218 కోట్ల నికర లాభాలు సాధించింది. ఇంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.209 కోట్ల లాభాలు నమోదు చేసింది. ఇదే సమయంలో రూ.506.7 కోట్లుగా ఉన్న నికర వడ్డీ ఆదాయం (ఎన్‌ఐఐ) క్రితం క్యూ4లో 2.7 శాతం పెరిగి రూ.514.3 కోట్లుగా నమోదయ్యింది. 2023 మార్చి ముగింపు నాటికి బ్యాంక్‌ స్థూల నిరర్థక ఆస్తులు 4.37 శాతానికి తగ్గాయి. ఇంతక్రితం డిసెంబర్‌ ముగింపు నాటికి స్థూల ఎన్‌పీఏలు 4.62 శాతంగా నమోదయ్యాయి. నికర నిరర్థక ఆస్తులు 2.67 శాతం నుంచి 2.36 శాతానికి తగ్గాయి. 2022-23లో మొత్తంగా 23 శాతం వృద్ధితో రూ.937 కోట్ల లాభాలు సాధించింది. వడ్డీ ఆదాయం 15 శాతం పెరిగి రూ.4,714 కోట్లుగా చోటు చేసుకుంది. మొత్తం డిపాజిట్లు 10 శాతం వృద్ధితో రూ.52,398 కోట్లకు చేరాయి. ఇంతక్రితం ఏడాది ఇదే కాలం నాటికి రూ.47,690 కోట్ల డిపాజిట్లు నమోదయ్యాయి. అడ్వాన్సులు 7 శాతం పెరిగి రూ.41,156 కోట్ల నుంచి రూ.43,971 కోట్లకు చేరాయి.