– పారదర్శకత, జవాబుదారీతనం అవసరం : రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు
నవతెలంగాణ-సిటీబ్యూరో
సివిల్ వివాదాలకు పోలీసులు దూరంగా ఉండాలని, భూసెటిల్‌మెంట్లకు పాల్పడితే చర్యలు తప్పవని రాచకొండ సీపీ సుధీర్‌బాబు తెలిపారు. పోలీసులు తమ విధి నిర్వహణలో పారదర్శకంగా, నిజాయితీగా, జవాబుదారీతనంతో ఉండాలని సూచించారు. శనివారం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా నేరేడ్‌మెట్‌లోని పోలీస్ కమిషనరేట్‌లో డీసీపీలు, అదనపు డీసీపీలు, ఏసీపీలతోపాటు ఇన్‌స్పెక్టర్ స్థాయి అధికారులతో సీపీ ప్రత్యేకంగా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. డ్రగ్స్ సరఫరా, వినియోగం మీద ఉక్కుపాదం మోపుతామన్నారు. డ్రగ్స్ నివారణకు కావాల్సిన అన్ని చర్యలూ తీసుకుంటామని, యువత మత్తు పదార్థాల భారిన పడకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో డ్రగ్స్ సరఫరా, వినియోగం మీద నిఘా పెంచాలని ఆదేశించారు. రాచకొండ పరిధిలో ప్రజలు ధైర్యంగా ఉండేవిధంగా పోలీసుల పనితీరుండాలన్నారు. క్షేత్రస్థాయిలో నేరాలను అరికట్టాలన్నారు. నిందితులను పట్టుకోవడంలో, నేరపరిశోధనలో సాంకేతిక ఆధారాలతోపాటు సీసీటీవీ కెమెరాలను ఉపయోగించుకోవా లన్నారు. అంతర్రాష్ట్ర దొంగల ముఠాలు, కరుడుగట్టిన నేరస్తులతోపాటు పాత నేరస్తుల కదలికల మీద ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. తిరిగి నేరాలకు పాల్పడకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రోజువారీ పెట్రోలింగ్‌ను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని, వీలైనంత తక్కువ సమయంలో బాధితుల వద్దకు చేరుకోవాల న్నారు. ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి ప్రజలతో మమేకమై పని చేయాలని, విజిబుల్ పోలీసింగ్‌కు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు. ప్రతిరోజూ కనీసం 15 నిమిషాలపాటు స్టేషన్ పరిధిలో ప్రజల మధ్య తిరుగుతూ సమస్యలు తెలుసుకుంటూ, వారితో మమేకం కావాలని సూచించారు. మహిళా సంరక్షణ కోసం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, షీ టీమ్స్ బృందాలను మరింత బలోపేతం చేయాలని ఆదేశించారు. సమర్థవంతంగా పని చేసే అధికారులు, సిబ్బందికి ప్రోత్సాహకాలు అందిస్తామన్నారు. ఈ సమావేశంలో అదనపు పోలీస్ కమిషనర్ తరుణ్ జోషీ, సైబర్ క్రైమ్ డీసీపీ అనురాధ, యాదాద్రి డీసీపీ రాజేష్ చంద్ర, మహేశ్వరం డీసీపీ శ్రీనివాస్, మల్కాజ్‌గిరి డీసీపీ గిరిజానకి, రోడ్ సేఫ్టీ డీసీపీ శ్రీబాల, డీసీపీ (అడ్మిన్) ఇందిర, అదనపు డీసీపీ (అడ్మిన్) శ్రీనివాస రెడ్డితోపాటు ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్ పాల్గొన్నారు.