పౌరసంబంధాలు ప్రగతికి మార్గదర్శకాలు

Civil relations are guidelines for progress– మహీంద్రా యూనివర్సిటీ డీన్‌ ప్రొఫెసర్‌ శశి నంజుండియా
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
అన్నిరంగాల్లోనూ పౌరసంబంధాలు (పీఆర్‌) ప్రగతికి మార్గదర్శకాలుగా నిలుస్తాయని మహీంద్రా యూనివర్సిటీ డీన్‌ (స్కూల్‌ ఆఫ్‌ మీడియా) ప్రొఫెసర్‌ శశి నంజుండియా అన్నారు. ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ సహా సాంకేతికత ఎంత పెరిగినా పౌరసంబంధాల ప్రాథాన్యత ఏమాత్రం తగ్గబోదని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని బాగ్‌ లింగంపల్లిలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ కళాశాల సహకారంతో పబ్లిక్‌ రిలేషన్స్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా హైదరాబాద్‌ చాప్టర్‌ ఆధ్వర్యంలో ఆదివారం ప్రత్యేక బూట్‌ క్యాంప్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అల్గోరిథం యుగంలో పీఆర్‌ పాత్ర పెరిగిందని వివరించారు. పీఆర్‌కు కొత్త పేర్లను జోడిస్తున్నారే తప్ప, దాని మూలాలు మాత్రం ఎప్పటిలాగే ఉన్నాయని తెలిపారు. సమాచారాన్ని మనస్సును కదిలించే విధంగా ప్రెజెంటేషన్‌ చేయడం గొప్ప కళ అని చెప్పారు. సాంకేతికత పెరిగే కొద్దీ పీఆర్‌లో సవాళ్లు కూడా పెరుగుతున్నాయనీ, వాటిని అధిగమించడానికి నిరంతర అధ్యయనం, ఆసక్తి, ఆధునికత ఉండాలని సూచించారు. వోక్స్‌సెన్‌ యూనివర్సిటీ డీన్‌ (స్కూల్‌ ఆఫ్‌ లా) ప్రొఫెసర్‌ జోష్‌ డాల్రింపుల్‌ మాట్లాడుతూ విద్యార్థులు తమ సొంత ప్రయోజనాల కోసం నెట్‌వర్కింగ్‌పై దృష్టి పెట్టాలనీ, ప్రొఫెషనల్‌ నెట్‌వర్కింగ్‌ బాగుంటేనే భవిష్యత్‌ అవకాశాలను అందిపుచ్చుకోవడం తేలిక అవుతుందని చెప్పారు. ఎన్‌ఎమ్‌డీసీ కార్పొరేట్‌ కమ్యూనికేషన్‌ హెడ్‌ జై ప్రకాష్‌, ఆలిండియా రేడియో ప్రోగ్రాం హెడ్‌ ఎస్‌ రమేష్‌, ప్రొఫెసర్‌ కింగ్‌స్టన్‌ జే, అనిందితా ముఖర్జీ సిన్హా, ముక్తాకుమార్‌, మృణాళ్‌, పీఆర్‌ఎస్‌ఐ జాతీయ న్యాయ సలహాదారు వై బాబ్జి తదితరులు పాల్గొన్నారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ కళాశాల జర్నలిజం విభాగాధిపతి డాక్టర్‌ ఎమ్‌ శేఖర్‌, ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ జీ కృష్ణ కుమార్‌ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయా రంగాల్లోని ప్రముఖులు చర్చలు నిర్వహించారు.