సివిల్‌ సప్లయిస్‌ను నిర్వీర్యం చేశారు

Civil supplies were crippled – 2014లో రూ.3వేల కోట్లున్న అప్పు నేడు రూ.58,860 కోట్లకు చేరింది
– కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి ఈ ప్రభుత్వం అప్పగించలేదు
– మేడిగడ్డ డిజైన్‌లోనే భారీ లోపం ఉంది
– డిటెక్టివ్‌ మైండ్‌ సెట్‌ ఉన్నోళ్లే కరెంట్‌ బిల్లు కట్టొద్దంటారు
– బీఆర్‌ఎస్‌పై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విమర్శ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
పౌరసరఫరాల శాఖను బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందనిఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విమర్శించారు. శనివారం హైదరాబాద్‌లోని సచివాలయంలో పౌరసరఫరాలు, సాగునీటి శాఖలపై మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డితో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ 2014లో రూ.3వేల కోట్లున్న అప్పు 2024లో రూ.58,860 కోట్లకు చేరిందని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పడే నాటికి రాష్ట్ర ప్రభుత్వం రూ.387 కోట్ల బకాయిలుండగా ప్రస్తుతం అవి రూ.14,354 కోట్లకు పెరిగాయని చెప్పారు. 2014కు ముందున్న ప్రభుత్వాలు రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేయడానికి ఆ శాఖకు ఎప్పటికప్పుడు డబ్బులు చెల్లించగా, గత ప్రభుత్వం నిధులివ్వకుండా రుణాలు తీసుకోమని గ్యారంటీ ఇచ్చి చేతులు దులుపుకుందని విమర్శించారు. కానీ రైతులు పండించిన ధాన్యం తామే కొనుగోలు చేస్తున్నట్టు గొప్పలు చెప్పుకుందని ఆరోపించారు. ధనిక రాష్టాన్ని కేసీఆర్‌ చేతుల్లో పెడితే అప్పుల కుప్పగా మార్చారని విమర్శించారు. ఉమ్మడి రాష్ట్రంలో 2.82 కోట్ల మంది లబ్ధిదారులకు బియ్యం పంపిణీ చేసినప్పుడు కూడా సివిల్‌ సప్లయిస్‌ శాఖకు ఇంత అప్పుల భారం లేదని గుర్తు చేశారు. ఎంత భారం ఉన్నా లబ్దిదారులకు ఇబ్బందులు రాకుండా బియ్యం పంపిణీ చేయడంతో పాటు రైతుల ధాన్యం కొనుగోలు చేయనున్నట్టు తెలిపారు. అలాగే విద్యార్థులకు సన్న బియ్యం కొనుగోలు చేసి సరఫరా చేస్తామన్నారు. పౌరసరఫరా శాఖలో జరిగిన ఆర్ధిక ఆరాచకత్వం గురించి వాస్తవాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు.
ఖర్చు రూ.94 వేల కోట్లు, ఆయకట్టు 40 వేల ఎకరాలు
గత ప్రభుత్వం రూ. 94వేల కోట్లు ఖర్చు చేసి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల 40 వేల ఎకరాల కొత్త ఆయకట్టు మాత్రమే సాగులోకి వచ్చిందని భట్టి విమర్శలు గుప్పించారు. వైఎస్‌ఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రూ.38వేల కోట్లతో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు చేపడితే ఇప్పుడు 16లక్షల ఎకరాలకు సాగు నీరందుతుందని వ్యాప్కో సంస్థ తేల్చగా దాన్ని రీడిజైన్‌ చేసి కాళేశ్వరం పేరుతో రూ.లక్ష కోట్లకు పెంచారని ఆరోపించారు. మేడిగడ్డ డిజైన్‌లోనే భారీ లోపం ఉందని ప్రాథమికంగా గుర్తించామన్నారు. కృష్ణానది పై ఉన్న ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీ బోర్డుకు ఈ ప్రభుత్వం అప్పగించలేదని గుర్తు చేశారు. కేసీఆర్‌ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాతే సీలేరులోని ఏడు మండలాలు ఏపీకి పోయాయన్నారు. డిటెక్టివ్‌ మైండ్‌ సెట్‌ ఉన్నోళ్లే కరెంట్‌ బిల్లు కట్టొద్దని సూచిస్తారని మాజీ మంత్రి కేటీఆర్‌ను ఉద్దేశించి విమర్శించారు.