హామీల అమలు తేదీలపై స్పష్టతనివ్వాలి

– కాంగ్రెస్‌ను ప్రజలు తిరస్కరించారు : బీజేపీ ఎల్పీ నేత
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రుణమాఫీని ఆగస్టు 15వ తేదీలోగా చేస్తామని ప్రకటించినట్టుగానే మిగతా హామీల అమలు తేదీలపైనా స్పష్టతనివ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు. మంగళవారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మీరిచ్చిన ఇచ్చిన 420 హామీల్లో ప్రధాన అంశాలు మాత్రం ఎప్పటి నుంచి అమలు చేస్తారనే స్పష్టత ఇవ్వకపోవడమంటే ఓట్లేసిన ప్రజలను మోసం చేయడమేననీ, అందుకే రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్‌కు ఎంపీ ఎన్నికల్లో 8 సీట్లను మాత్రమే ఇచ్చారని విమర్శించారు. రైతు భరోసా కింద కౌలు రైతులకు, రైతులకు ఇస్తామన్న రూ.15 వేల సాయం, వ్యవసాయ కూలీలకు ఇస్తామన్న రూ.12 వేలు ఏమయ్యాయని ప్రశ్నించారు. సన్నవడ్లకే రూ.500 బోనస్‌ అని రాష్ట్ర ప్రభుత్వం మోసం చేసిందని విమర్శించారు.