– పోలీసు స్టేషన్ ఎదుట ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ భైటాయింపు
– రెండు పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థులతో పాటు పలువురిపై కేసులు
నవతెలంగాణ-కాగజ్‌నగర్
కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూరు (టి) నియోజకవర్గంలో ఆదివారం రాత్రి బహుజన సమాజ్ పార్టీ, భారత రాష్ట్ర సమితి నాయకుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ సంఘటనలో ఈ రెండు పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థులతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. నియోజకవర్గంలోని కాగజ్‌నగర్ పట్టణంలో ఆదివారం రాత్రి ఏడు గంటల సమయంలో బీఎస్‌పీ రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్యే అభ్యర్థి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతుండగా, బీఆర్‌ఎస్ అభ్యర్థి, ప్రస్తుత ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ప్రచార వాహనం సమీపంలోనే నిలిపి పెద్ద శబ్దంతో ప్రచారం చేపడుతుండటంతో ప్రవీణ్‌కుమార్ ఆ వాహనాన్ని అక్కడి నుంచి వెళ్లిపోవాలని, లేదా శబ్దం తక్కువ చేయాలని విజ్ఞప్తి చేశారు. అయినా వాహనం తీయకపోవడం, శబ్దం తక్కువ చేయకపోవడంతో అక్కడే ఉన్న బీఎస్‌పీ నాయకులు, కార్యకర్తలు వాహనం వద్దకు వెళ్లగా వాహనం వద్ద ఉన్న బీఆర్‌ఎస్ నాయకులకు, వీరికి మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. దాంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు. తమ ప్రచారాన్ని బీఆర్‌ఎస్ నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేసినా పోలీసులు చోద్యం చూస్తుండడాన్ని నిరసిస్తూ ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ మధ్యలోనే సమావేశం ఆపి పోలీస్‌స్టేషన్ వరకు ర్యాలీగా వెళ్లి బైటాయించారు. తక్షణమే వారిపై చర్య తీసుకోవాలని, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్త ఆందోళన చేపడతామని హెచ్చరించారు. దాంతో పోలీసులు బీఎస్‌పీ నాయకులు సయ్యద్ ఫయీమ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కోనేరు కోనప్పతో పాటు ఆ పార్టీ నాయకులు కోనేరు ఫణి, కోనేరు వాసు, లలిత్, అన్షుమన్, అలీంలపై కేసు నమోదు చేశారు. అదేవిధంగా బీఎస్‌పీ అభ్యర్థి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్‌తో పాటు పలువురు తనను చంంపుతానని బెదిరింపులకు పాల్పడుతూ తన వద్ద ఉన్న రూ. 25 వేలను లాక్కున్నారని బీఆర్‌ఎస్ ప్రచార వాహనం డ్రైవర్ అలీం ఇచ్చిన ఫిర్యాదు మేరకు బీఎస్‌పీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్‌తో పాటు ఆయన కుమారుడు ఆర్‌ఎస్ పుణీత్, నాయకులు ఎండీ షబ్బీర్, షేక్‌చాంద్, పి తిరుపతి, ముతాఫిజ్, అర్షద్‌హుస్సేన్, యూస్‌మాన్, తన్నీరు పోచం, దుర్గం ప్రవీణ్, ఓమాన్, సల్మాన్, మజీద్, నజీద్‌లపై కేసు నమోదు చేసినట్టు టౌన్ సీఐ బి స్వామి తెలిపారు.