జేఎన్‌యూఎస్‌యూ ఎన్నికల్లో విద్యార్థి సంఘాల మధ్య ఘర్షణ

న్యూఢిల్లీ: దేశరాజధాని న్యూఢిల్లీలో గల జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ)లో ఆరెస్సెస్‌ అనుబంధ విద్యార్థి విభాగం ఏబీవీపీ రెచ్చిపోయింది. ఎన్నికల కమిటీ సభ్యుల ఎంపికలో లెఫ్ట్‌ విద్యార్థి గ్రూపులతో ఘర్షణకు దిగింది. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై యూనివర్సిటీ వీసీ శాంతిశ్రీ డి. పండిట్‌ తీవ్రంగా స్పందించారు. రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా.. ఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. యూనివర్సిటీలోని స్కూల్‌ ఆఫ్‌ లాంగ్వేజెస్‌ బిల్డింగ్‌ వద్ద ఈ ఘర్షణ జరిగింది. ఘర్షణకు దిగిన ఏబీవీపీ కార్యకర్తలే తిరిగి తమపై కేసులు పెట్టారని వామపక్ష విద్యార్థి నాయకులు తెలిపారు. ఈ ఘర్షణలో గాయపడిన విద్యార్థులను సఫ్ధర్‌గంజ్‌ ఆస్పత్రిలో చేర్పించారు. ”వర్సిటీలో ఘర్షణకు సంబంధించి మాకు సమాచారమందింది. కనీసం నలుగురు విద్యార్థులు గాయపడ్డారు. ఇరు వర్గాల నుంచి పలు ఫిర్యాదులు అందాయి. తదుపరి విచారణ కొనసాగుతున్నది” అని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఈ విషయంలో అడ్మినిస్ట్రేషన్‌ దృష్టి సారిస్తుందనీ, కఠిన చర్యలు తీసుకుంటుందని వీసీ స్పష్టం చేశారు. కాగా, ఈ ఘర్షణకు సంబంధించిన వీడియోలు సైతం బయటకు వచ్చాయి. ఒక విద్యార్థి.. ఇతర విద్యార్థులను కర్రతో కొడుతుండటం, ఇంకో వ్యక్తి.. విద్యార్థులపై సైకిల్‌ను విసిరేసిన దృశ్యాలు అందులో కనిపించాయి. తనకు ఏబీవీపీ సభ్యుల నుంచి ప్రాణహాని ఉన్నదని జేఎన్‌యూఎస్‌యూ జాయింట్‌ సెక్రెటరీ మహ్మద్‌ దానిశ్‌ ఆందోళన వ్యక్తం చేశాడు.