నవతెలంగాణ – రాయపోల్
ఎన్నికల సమీపిస్తున్న వేళ ఓటర్ల ప్రభావితం చేయడానికి రాజకీయ పార్టీలు వివిధ ప్రయత్నాలు చేస్తున్నాయని తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 13 న జరిగే లోక్ సభ ఎన్నికలకు ఎన్నికల కమిషన్ సర్వం సిద్ధం చేశారు. మరికొద్ది గంటలలో ఎన్నికలు ప్రారంభమవుతుండగా ఓటర్లను ప్రభావితం చేయడానికి పార్టీలు ఎవరి ప్రయత్నాలు చేస్తున్నారు. బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్ వర్గాలు ఘర్షణకు దిగారు. బిఆర్ఎస్ నాయకులు ఓటర్లను ప్రలోభ పెట్టడానికి అధిక మొత్తంలో డబ్బులను తరలించి ఆ డబ్బును ఓటర్లకు పంచి ఓట్లు దండుకోవాలని చూస్తున్నారని బిఆర్ఎస్ నాయకులపై బిజెపి, కాంగ్రెస్ నాయకులు ఆరోపణలు చేశారు. రాయపోల్ మండలం తిమ్మక్ పల్లి గ్రామ శివారులో ఆదివారం ఓ ఫామ్ హౌస్ లో బిఆర్ఎస్ నాయకులు అధిక మొత్తంలో డబ్బులు దాచారని బిజెపి, కాంగ్రెస్ నాయకులు ఆరోపించి అక్కడ చేరుకొని బీఆర్ఎస్ నాయకులతో ఘర్షణకు దిగారు. దీనితో అక్కడ ఒకరినొకరు ఆరోపణలు చేసుకోవడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. మాట మాట పెరిగి ఒకరినొకరు తొసుకున్నారు. గొడవ తీవ్రంగా మారడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. అక్కడికి చేరుకున్న రాయపోల్ ఎస్సై రఘుపతి కి బిజెపి, కాంగ్రెస్ నాయకులు ఆ ఫామ్ హౌస్ లో డబ్బులు దాచారని సమాచారం ఇవ్వడంతో ఎస్సై ఫామ్ హౌస్ మొత్తం వెతికారు. ఎక్కడ డబ్బు ఆచూకీ లభించలేదు. అయినప్పటికీ పరిస్థితులలో మార్పు రాకపోవడంతో తొగుట సిఐ లతీఫ్, దౌల్తాబాద్, తొగుట ఎస్సైలు అక్కడికి చేరుకొని ఆయా పార్టీల కార్యకర్తలను నచ్చజెప్పి అక్కడ నుండి పంపించేశారు. దీంతో గొడవ సద్దుమణిగింది. ఎన్నికల నేపథ్యంలో ఎవరైనా ఓటర్లకు డబ్బు పంపిణీ చేస్తున్నట్లు గుర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా అన్ని రాజకీయ పార్టీలు నాయకులు కార్యకర్తలు పోలీసులకు సహకరించాలని కోరారు.