– బెంగళూర్‌పై 38-35తో గెలుపు
హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్‌లో తెలుగు టైటాన్స్ మూడో విజయం సాధించింది. శనివారం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 38-35తో బెంగళూర్ బుల్స్‌పై గెలుపొందింది. తెలుగు టైటాన్స్ ఆటగాళ్లు పవన్ సెహ్రావత్ (14 పాయింట్లు), ఆశీష్ నర్వాల్ (6 పాయింట్లు), అజిత్ పవార్ (5 పాయింట్లు), విజరు మాలిక్ (5 పాయింట్లు) అదరగొట్టారు. బెంగళూర్ బుల్స్ తరఫున ఆల్‌రౌండర్లు పంకజ్ (9 పాయింట్లు), నితిన్ రావల్ (7 పాయింట్లు), రెయిడర్ అజింక్య పవార్ (9 పాయింట్లు) రాణించారు. తెలుగు టైటాన్స్‌కు ఇది ఆరు మ్యాచుల్లో మూడో విజయం కాగా.. బెంగళూర్ బుల్స్‌కు ఆరు మ్యాచుల్లో ఇది ఐదో పరాజయం కావటం గమనార్హం. ఈ విజయంతో తెలుగు టైటాన్స్ పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి ఎగబాకింది. రెయిడర్ పవర్ సెహ్రావత్ సీజన్లో అత్యధిక రెయిడ్ పాయింట్లు (65) సాధించిన ఆటగాడిగా నిలిచాడు. మరో మ్యాచ్‌లో యూపీ యోధాస్‌పై పట్నా పైరేట్స్ 42-37తో విజయం సాధించింది.