వేర్వేరు రోజుల్లో 9,10 తరగతుల సైన్స్‌ పరీక్షలు

– ఉత్తర్వులు విడుదల
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో తొమ్మిది, పదో తరగతి చదువుతున్న విద్యార్థుల పరీక్షల విధానంలో ప్రభుత్వం సంస్కరణలు తెచ్చింది. ఈ మేరకు విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం శుక్రవారం ఉత్తర్వులు (జీవోనెంబర్‌ 23) విడుదల చేశారు. తొమ్మిది, పది తరగతుల పరీక్షల నిర్వహణకు సంబంధించి 2022, డిసెంబర్‌ 28న విడుదల చేసిన జీవో నెంబర్‌ 33కు సవరణ చేస్తున్నామని తెలిపారు. 33 జీవో ప్రకారం పారా నెంబర్‌ 3లో తొమ్మిది, పదో తరగతి విద్యార్థుల పరీక్షల సమయం అన్ని సబ్జెక్టులకూ మూడు గంటలు ఉంటుందని పేర్కొన్నారు. కానీ సైన్స్‌ సబ్జెక్టు సమయం మాత్రం మూడు గంటలా 20 నిమిషాలుంటుందని వివరించారు. ఒకే రోజు గంటన్నర ఫిజికల్‌ సైన్స్‌, గంటన్నర బయలాజికల్‌ సైన్స్‌ సబ్జెక్టులకు పరీక్ష నిర్వహించాలని తెలిపారు. ఫిజికల్‌ సైన్స్‌ పరీక్ష ముగిసిన తర్వాత జవాబు పత్రాలను తీసుకుని బయలాజికల్‌ సైన్స్‌ ప్రశ్నాపత్రాలను ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఇందు కోసం అదనపు సమయం అవసరమవుతుందని వివరించారు. అందుకే సైన్స్‌ సబ్జెక్టు పరీక్ష నిర్వహణకు 20 నిమిషాలు అదనంగా కేటాయించామని పేర్కొన్నారు. దీన్ని మార్పు చేశామని తెలిపారు. 23 జీవో పారా నెంబర్‌ 3 ప్రకారం తొమ్మిది, పదో తరగతి విద్యార్థులకు అన్ని సబ్జెక్టుల రాతపరీక్షలకూ మూడు గంటల సమయం కేటాయించామని వివరించారు. సైన్స్‌ సబ్జెక్టును రెండు భాగాలుగా విడదీసి పరీక్షలను నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఫిజికల్‌ సైన్స్‌, బయలాజికల్‌ సైన్స్‌ సబ్జెక్టుల పరీక్షలను ఒకే రోజు కాకుండా వేర్వేరు రోజుల్లో గంటన్నర సమయం చొప్పున నిర్వహిస్తామని వివరించారు.