వర్గ పోరాటాలు, కార్మికవర్గ ఐక్యతే లక్ష్యంగా సీఐటీయూ ఆవిర్భావం

– పెట్టుబడిదారి విధానాలు, మతోన్మాదానికి వ్యతిరేకం పోరాటాలు: రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్‌
– సంఘం జెండాను ఆవిష్కరించిన ఉపాధ్యక్షులు ఎస్వీ రమ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
సంఘాలు పాలకవర్గాల తొత్తులుగా పనిచేయడాన్ని జీర్ణించుకోలేక, వర్గపోరాటాలు, కార్మికవర్గ ఐక్యతే లక్ష్యంగా 1970లో సీఐటీయూ ఆవిర్భవించిందని ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్‌ తెలిపారు. సీఐటీయూ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని జమీస్తాన్‌పూర్‌లో రాష్ట్ర కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం ఉపాధ్యక్షురాలు ఎస్వీ రమ జెండాను ఆవిష్కరించారు. అనంతరం రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేష్‌ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో భూపాల్‌ మాట్లాడుతూ ‘ఐక్యత-పోరాటం’ నినాదంతో ఏర్పడిన సీఐటీయూ దేశంలోఇప్పటి వరకు అనేక సమ్మెలను విజయవంతంగా నిర్వహిచిందన్నారు. కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టిందని అన్నారు. ప్రారంభంలోనే రైల్వే సమ్మె మొదలుకుని, తద్వారా బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేకవిధానాలకు నిరసనగా రెండురోజులపాటు సమ్మె నిర్వహించడంలో సీఐటీయూ కృషి ఎంతో ఉందన్నారు.1991లో పీవీ నరసింహారావు హయాంలో నూతన ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా నిర్వహించిన దేశవ్యాప్త సమ్మెలో ప్రధాన పాత్ర పోషించిందని తెలిపారు. ఐఎన్‌టీయూసీ, ఏఐటీయూసీ, హెచ్‌ఎంఎస్‌ లాంటి కేంద్ర కార్మిక సంఘాలను ఏకతాటిపైకి తీసుకురావడంలో గొప్ప విజయం సాధించిందని చెప్పారు. నరేంద్రమోడీ సర్కార్‌ కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ కార్పొరేట్ల ప్రయోజనాల కోసం దేశ సంపదను తాకట్టు పెట్టిందని అన్నారు. కార్మిక చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్‌ కోడ్‌లను తీసుకొచ్చిందని తెలిపారు. రూ.60లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తులను రూ.6లక్షల కోట్లకు పెట్టుబడిదారులకు అర్పించిందని అన్నారు. కనీస వేతనాలు పెంచకపోవడంతోపాటు ధరలను విపరీతంగా పెంచిందని అన్నారు. ప్రజలపై తీవ్రమైన భారాలను మోపి కార్పొరేట్లకు రాయితీలు ప్రకటించిందని తెలిపారు. నిరుద్యోగం, దారిద్య్రాన్ని పెంచిపోషించిందని, వీటన్నింటిని మరుగపడేయ డానికి మతం, కులాల పేరుతో ఘర్షణలు సృష్టించిందని విమర్శించారు.
రాజ్యాంగాన్ని తుంగలోతొక్కిందని, ప్రజాస్వామ్యాన్ని మంట గలిపిందని చెప్పారు. పెట్టుబడిదారి విధానం, మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడడమే కార్మికుల తక్షణ కర్తవ్యమని, అందుకు అన్ని కార్మిక సంఘాలు కలిసిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కూరపాటి రమేష్‌, రాష్ట్ర కమిటీ సభ్యులు యాటల సోమన్న, సునీత, నగేష్‌, నాయకులు రాజ్‌కుమార్‌, భారతి, సుమలత, అనిల్‌ తదితరులు పాల్గొన్నారు.