
తెలంగాణ యూనివర్సిటీ లో పోటీ పరీక్షల విభాగం డైరెక్టర్ డాక్టర్ కె.వి.రమణాచారి ఆధ్వర్యంలో గ్రూప్ 1 పరీక్షలకు బుధవారం తరగతులను ప్రారంభించారు.ఈ ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రిజిస్ట్రార్ ప్రొఫెసర్ డాక్టర్ యం యాదగిరి పాల్గొని మాట్లాడుతూ.. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ బుర్ర వెంకటేశం రాష్ట్రస్థాయిలోని ప్రసిద్ధ కోచింగ్ సెంటర్ల నుండి నిష్ణాతులైన అధ్యాపకులను ఆహ్వానించి విద్యార్థులకు తరగతులను నిర్వహించాలని, లైబ్రరీ పుస్తకాలను అందుబాటులో ఉంచాలని అదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. విద్యార్థులు ఈ సదవకాశాన్ని వినియోగించుకొని అధిక సంఖ్యలో గ్రూప్ 1 ప్రిలిమ్స్ అర్హత పొందితే మెయిన్స్ కు కూడా అనుభవం గల అధ్యాపకులచే తరగతులు నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి అతిథిగా హాజరైన కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ డాక్టర్ అరతి మాట్లాడుతూ సమయం వృధా చేసుకోకుండా కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని పేర్కొన్నారు. డేవిడ్ రాజు మాట్లాడుతూ ఇండియన్ పాలిటి గురించి తనదైన శైలిలో సులభమైన మార్గంలో భారత రాజకీయాలపై సమగ్రమైన అవగాహన కల్పించారు. గురువారం నుండి విద్యార్థులు అధిక సంఖ్యలో ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కాంపిటీటివ్ సెల్ డైరెక్టర్ రమణాచారి కోరారు. తెలంగాణ యూనివర్సిటీ లో పరీక్షల విభాగానికి సంబంధించి అన్ని రకాల ఫీజులు గతంలో ఉన్నట్టుగానే ఫీజు స్ట్రక్చర్ ఉంటుందని విద్యార్థులకు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం యాదగిరి హామీ ఇచ్చారు.