అలా తరగతి గదిలోకి
అడుగు పెట్టకముందే
కొందరు పిల్లలు వాకిలి ముంగిట్లో
తోరణాలయి నన్ను ఆహ్వానిస్తారు
వానొచ్చే ముందు తూనీగల్లా
సందిడంతా సద్దుమనుగుతుంది
శుభోదయమని ఆ కుడిచేతులలా
ఎత్తుతున్నప్పుడల్లా
ఇంద్రధనుస్సులై విరిసినట్టే వుంటుంది
పిల్లల మొగములోని నవ్వుల పువ్వులన్నీ
నా కండ్లల్లో విరిసినాక
పూసుకున్న రెక్కలతో
తరగతికొమ్మన పిట్టనై రాగాలందుకుంటా
జ్ఞానం విత్తులు మొగ్గలు కట్టేది
తరగతి తీగల క్షేత్రం పైనే
ఆ మొగ్గలకు మాటలనవుతా
పలుకులకు మలుపునవుతా
ఆటలకు పాటనవుతా
ప్రశ్నలకు సమాధానమవుతా
‘తరగతి’ వేయిపూల పరిమళాల
చినుకుల తోట, ఆకుపచ్చని పందిరి
పొద్దంతా జోలపాడే అమ్మఒడి
కాలం కురుస్తున్న క్షణ బిందువుల మధ్య
విరామగంట మోగినప్పుడల్లా తరగతి గది
పైరు కోసిన కయ్య లాగవుతుంది
చివరిగంట మోగగానే
వొలిచిన మొక్కజొన్న కంకిలా
దిగుడు కండ్ల దిగులు దశ్యం
దేవునిముందు ధూపం
పొలపము అలల్లా వ్యాపించినట్లు
‘తరగతి గదులే’ సమాజపు
ప్రాణవాయువులు
లేలేత మెదుళ్లలో ఆలోచనల
సాగుబడి గల సారవంతమైన నేల
ఏ దేశం లో నైనా
స్వార్థం లేని బాల్యాన్ని చూడాలంటే
తరగతి గది దాకా నడవాల్సిందే
– ఈ.రాఘవేంద్ర, 9494074022