కేరళ సీఎంకు క్లీన్‌ చిట్‌

Clean chit for Kerala CM– అవినీతి జరిగిందనడానికి ఎలాంటి ఆధారాల్లేవు
– ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను సమర్థిస్తూ లోకాయుక్త తీర్పు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ముఖ్యమంత్రి విపత్తు సహాయ నిధి (సీఎండీఆర్‌ఎఫ్‌) దుర్వినియోగానికి సంబంధించిన ఆరోపణల కేసులో కేరళ సీఎం పినరయి విజయన్‌ ప్రభుత్వానికి క్లీన్‌చిట్‌ లభించింది. గతంలో ప్రభుత్వ తీసుకున్న నిర్ణయాలను సమర్థిస్తూ లోకాయుక్త తీర్పు ఇచ్చింది. ఈ సందర్భంగా కేరళ సీఎం విజయన్‌తో పాటు 18 మంది మాజీ క్యాబినెట్‌ మంత్రులపై వేసిన పిటిషన్‌ను లోకాయుక్త తిరస్కరించింది. బంధుప్రీతి లేదా అవినీతి జరిగిందనడానికి ఎలాంటి ఆధారాల్లేవని లోకాయుక్త జస్టిస్‌ సిరియాక్‌ జోసెఫ్‌, అప్‌ లోకాయుక్తలు జస్టిస్‌ హరూన్‌ అల్‌ రషీద్‌, జస్టిస్‌ బాబు మాథ్యూ పి జోసెఫ్‌ తో కూడిన లోకాయుక్త ధర్మాసనం పేర్కొంది. సీఎండీఆర్‌ఎఫ్‌ లోని నిధులను దుర్వినియోగం చేశారంటూ 2018లో సీఎంతో పాటు, పలువురు మంత్రులపై కేసు నమోదైంది. నిబంధనలకు విరుద్ధంగా ఎన్సీపీ మాజీ చీఫ్‌ ఉజ్వూర్‌ విజయన్‌ కుటుంబానికి రూ.25 లక్షలు, దివంగత ఎమ్మెల్యే రామచంద్రన్‌ నాయర్‌ కుటుంబానికి రూ.9 లక్షలు, ప్రమాదంలో మరణించిన పోలీసు అధికారి కుటుంబానికి రూ.20 లక్షల ఆర్థిక సాయం అందించారని ఆరోపిస్తూ కాంగ్రెస్‌ నేత ఆర్‌ఎస్‌ శశికుమార్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. జస్టిస్‌ సిరియాక్‌ జోసెఫ్‌, జస్టిస్‌ హరున్‌ ఉల్‌ రషీద్లతో కూడిన డివిజన్‌ బెంచ్‌ ఈ వ్యాజ్యాన్ని విచారించింది. అయితే సభ్యుల మధ్య అభిప్రాయ భేదాలు రావడంతో ధర్మాసనం ఏకగ్రీవ నిర్ణయానికి రాలేకపోయింది. దీంతో 2023 మార్చిలో ఈ కేసును విస్తత ధర్మాసనానికి రిఫర్‌ చేసింది. దీంతో ఇప్పుడు పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది.