క్లీన్‌ గంగా అనుమతుల్లేవ్‌

క్లీన్‌ గంగా అనుమతుల్లేవ్‌– క్లియరెన్స్‌ లేకుండా వారణాసి టెంట్‌ సిటీ ప్రాజెక్టుకు గ్రీన్‌ సిగల్‌
– జెండా ఊపి ప్రారంభించిన ప్రధాని మోడీ
న్యూఢిల్లీ : గంగా నది పరిశుభ్రత విషయంలో ఉపన్యాసాలు ఇచ్చే మోడీ సర్కారు.. వాస్తవానికి వచ్చే సరికి అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నది. యూపీలోని వారణాసి టెంట్‌ సిటీ ప్రాజెక్టు ప్రారంభమే దీనికి నిదర్శనం. క్లీన్‌ గంగా క్లియరెన్స్‌ లేకుండానే ఈ ఏడాది జనవరి 13న ఈ ప్రాజెక్టును ప్రధాని మోడీ జెండా ఊపి ప్రారంభించారు. తన స్వంత నియోజకవర్గమైన వారణాసిలోని గంగా నది వరద మైదానాల్లో విలాసవంతమైన టెంట్‌ సిటీని ఆవిష్కరించటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీనితో పాటు గంగా నది క్రూయిజ్‌ను కూడా జెండా ఊపి ప్రారంభించారు.
అయితే పది నెలల తర్వాత నేషనల్‌ మిషన్‌ ఫర్‌ క్లీన్‌ గంగా (ఎన్‌ఎంసీజీ) నోడల్‌ ఏజెన్సీ స్పందించింది. వారణాసి డెవలప్‌మెంట్‌ అథారిటీ(వీడీఏ) అనుమతి తీసుకోకపోవడంతో ఇప్పుడు ప్రాజెక్ట్‌ క్లియరెన్స్‌ లేదని నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌కు తెలిపింది. గంగా నది (పునరుజ్జీవనం, రక్షణ మరియు నిర్వహణ) అథారిటీస్‌ ఆర్డర్‌ 2016 నోటిఫైడ్‌ నిబంధనల ప్రకారం.. గంగా లేదా దాని ఉపనదుల వరద మైదానాలపై తాత్కాలిక లేదా శాశ్వతమైన నిర్మాణాలు అనుమతించబడవు. కొన్ని సందర్భాలలో తాత్కాలిక నిర్మాణాలకు కూడా ముందస్తు అనుమతులు తప్పనిసరి. అయితే, ప్రాజెక్ట్‌ అమలులోకి వచ్చిన మూడు నెలల తర్వాత ఈ ఏడాది ఏప్రిల్‌ 21న మాత్రమే వీడియే నుంచి అనుమతి కోసం దరఖాస్తు అందిందని ఎన్‌ఎంసీజీ తెలిపింది.తుషార్‌ గోస్వామి మార్చిలో ఎన్జీటీని ఆశ్రయించారు. ”100 హెక్టార్లలో” విస్తరించి ఉన్న టెంట్‌ సిటీ 2016 ఆర్డర్‌ను ఉల్లంఘించిందని ఆరోపించారు. ఇది నదీగర్భంలో నిర్మాణాన్ని నిషేధించింది. దీనిపై విచారణకు ప్రభుత్వ అధికారులతో కూడిన ఏడుగురు సభ్యులతో కూడిన నిపుణుల కమిటీని ధర్మాసనం ఏర్పాటు చేసింది. ఈ కేసు విచారణ సందర్భంగా ఎన్‌ఎంసీజీ గత వారం ఎన్జీటీతో తన సమాధానాన్ని పంచుకుంది.