పాఠశాలల ప్రక్షాళన అత్యవసరం!

6-14 సంవత్సరాల వయసు గల వారి కోసం, 2009లో ఉచిత నిర్భంద విద్యాచట్టం చేసింది కేంద్ర సర్కారు. ఆర్టికల్‌ 21-ఏ ప్రకారం ప్రతి పిల్ల వాడికి ప్రాథమికోన్నత స్థాయి వరకు సంతప్తికరమైన, సమాన నాణ్యమైన విద్యను పొందడం వారి హక్కు. కానీ ఆ హక్కు రోజురోజుకూ విద్యార్థులకు దూరమవుతోంది. ప్రభుత్వ విద్యారంగం బలహీన పడుతూ ఆ స్థానంలో ప్రయివేటు, కార్పోరేట్‌ విద్యా వ్యవస్థ విస్తరిస్తోంది. దానికి కారణం ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రులకు నమ్మకం సన్నగిల్లడమే. వారికి విశ్వాసం కలిగించే దిశగా పాలకులు చేపట్టే కార్యక్రమా లు నిష్పలమవుతున్నాయి. రాష్ట్రంలో మొత్తం 41 వేలా 369 పాఠశాల్లో 10 వేలా 967 ప్రయివేటు పాఠశాలలున్నాయి. మొత్తం విద్యార్థుల్లో 50.23 శాతం ప్రయివేటు విద్యాసంస్థల్లో చదువుతున్నా రంటే, ప్రభుత్వ స్కూళ్లలో ఎన్‌రోల్‌మెంట్‌ ఎలా పడిపోయిందో అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు ప్రయివేటుకంటే రెట్టింపు ఉన్నప్పటికీ, చదువులో నాణ్యత, పర్యవేక్షణ, ఎన్‌రోల్‌మెంట్‌లో వెనుకబడినట్టు స్పష్టమవు తోంది. గత ప్రభుత్వం మన ఊరు- మన బడి, మన బస్తీ-మన బడి కార్యక్రమాన్ని చేపట్టి వేల కోట్ల రూపాయల నిధులు ఖర్చు చేసినా.. ఫలితాలు పెద్దగా రాలేదు. 2021-22 ఏడాదికి 9,123 పాఠశాలలకు రూ.3, 492.62 కోట్లు కేటాయించింది. ఇందుకు 14 లక్షలా 71 వేలా 684 మంది విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పన కల్పిస్తామని పేర్కొంది. ఆ తరువాత ఎన్నికలు రావడంతో రెండో దశ కేటాయింపులు, మొదటి దశ పనుల పురోగతికి మోక్షం లభించని దుస్థితి ఏర్పడింది. దీని స్థానంలో ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాల స్కీమ్‌ను తీసుకొచ్చింది. ప్రభుత్వ పాఠశాలలోని ప్రతీ తరగతి నుండి మహిళా సంఘంలోని ముగ్గురు తల్లులను ఎంపికచేసి హెచ్‌ఎం కన్వీనర్‌గా, మహిళా సంఘ అధ్యక్షురాలిని ఛైర్‌పర్సన్‌గా కలెక్టర్‌ ఎంపికచేస్తూ మౌలిక సదుపాయాల పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించేందుకు జీవో జారీ చేసింది. పాఠశాలలో మౌలిక సదుపా యాల కల్పనకు సిఫారసుచేసి, తద్వారా పనులు చేయిస్తుంది ప్రభుత్వం. ప్రతీ రెండు మాసాలకోసారి సమావేశాలు నిర్వహించి సౌకర్యాల కల్పనపై పర్యవేక్షించేలా ఈ కార్యక్రమ రూపకల్పన చేసింది. ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. విద్యార్థుల రోజు వారి పర్యవేక్షణ, నాణ్యమైన విద్యాబోధనపై దృష్టి సారించాల్సిన అవసరం ఉన్నది.
– చిలగాని జనార్థన్‌, 8121938106.