వాస్తవాలకు దగ్గరగా..

వాస్తవాలకు దగ్గరగా..– హామీలు అమలుచేస్తే గొప్ప బడ్జెట్‌ అవుతుంది : సీపీఐ శాసనసభాపక్షనేత కూనంనేని సాంబశివరావు
నవతెలంగాణ-సిటీబ్యూరో
గత ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని, కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టి బడ్జెట్‌ వాస్తవాలకు దగ్గరగా ఉందని సీపీఐ శాసనసభాపక్ష నేత కూనంనేని సాంబశివరావు అన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేస్తే గొప్ప బడ్జెట్‌ అవుతుందన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద ఆయన శనివారం మాట్లాడారు. బీఆర్‌ఎస్‌ హయాంలో అంచనాలను పెంచి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారని, అయితే కాంగ్రెస్‌ వాస్తవికత ఆధారంగా బడ్జెట్‌ తయారు చేసిందన్నారు. గతేడాది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం బడ్టెట్‌ ఆచరణలో అమలు చేయకపోవడంతో రూ.66వేల కోట్లు మిగిలిపోయాయన్నారు. ఈసారి కాంగ్రెస్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్‌తో ఎన్నికల్లో ఆ పార్టీ ఇచ్చిన ఆరు హామీలను నెరవేర్చే అవకాశాలున్నాయన్నారు. రైతుబంధుకు సంబంధించి మంచి నిర్ణయం చేశారన్నారు. ఇంతకుముందు పట్టణాల్లో వున్న పెద్దపెద్ద గెస్ట్‌హౌస్‌ల భూములకు, ఇతర భూములతోపాటు సాగుదారులు కానివారికి కూడా రైతుబంధు డబ్బులు ఇచ్చారన్నారు. అలాంటి అంశాలను నివారించి.. ఈసారి కౌలు రైతులను సైతం పరిగణనలోకి తీసుకుని రైతుబంధు ఇస్తామనడం సంతోషకరమన్నారు. ధరణి మార్పుచేయడం మంచిదేన్నారు. రాష్ట్ర ఆర్థిక సంఘం చెప్పిన విధంగా పంచాయతీలు, గ్రామాలు, పట్టణాలకు 11శాతం నిధులు కేటాయించడంతో రాష్ట్రం అభివృద్ధిలో ముందుకెళ్తుందన్నారు. నీటి వనరులపై కాంగ్రెస్‌ శ్రద్ధపెడుతుందని.. దాన్ని హర్షిస్తున్నామ న్నారు. ప్రతి గ్రామంలో స్థానికంగా పరిశ్రమలు ఏర్పాటుచేయడం, పంటలకు గిట్టుబాటు ధరలు ఇస్తామనడాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు. ప్రతి మండలంలో తెలంగాణ పబ్లిక్‌ స్కూల్స్‌ ఏర్పాటుచేయడం, అందుకు కోసం రూ.500కోట్లు కేటాయించడం మంచి పరిణామమని, దాంతో గిరిజన, దళిత, బడుగుబలహీన వర్గాలు, రైతు పిల్లలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఆరోగ్యశ్రీ పరిధి రూ.10లక్షలకు పెంచారని, ప్రతి నియోజకవర్గంలో 3500 ఇంద్రమ్మ ఇండ్లు నిర్మిస్తామని ప్రతిపాదనలు చేయడం శుభపరిణామన్నారు. కాళేశ్వరంపై విచారణ జరిపించాలన్నారు. దాదాపు రూ.లక్ష కోట్లు ఖర్చు చేస్తే అందులో రూ.70వేల కోట్ల విలువైన మేడిగడ్డతో పాటు ఇతర ప్రాజెక్టులు పనికిరాకుండా పోయాయని, ఆ డబ్బులను నీళ్లల్లో పోసినట్టయిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందో కాంగ్రెస్‌ శ్వేతపత్రం విడుదల చేసిందన్నారు.