కమ్ముకుంటున్న కరువు మేఘాలు

– వర్షాభావంతో రాష్ట్రం విలవిల వానల కోసం రైతుల బెంగ ప్రత్యామ్నాయ చర్యలపై సర్కారు దృష్టి
– ఎలా లెక్కిస్తారు..
కరువును అంచనా వేయడానికి ప్రత్యేకమైన మార్గదర్శకాలు ఉన్నాయి. వరుసగా 21 రోజులు వర్షంపడకపోతే కరువుఛాయలు నెలకొన్నట్టుగా భావిస్తారు. అలాగే 21 నుంచి 28 రోజుల వరకు వర్షం పడకపోతే కరువు కింద అంచనా వేస్తారు. ఇకపోతే 28 నుంచి 43 రోజులు వానరాకపోతే తీవ్రమైన కరువుగా నిర్ణయిస్తారు.
లోటు
వర్షం పడాల్సిన దానికంటే 25 లోపు ఉన్న జిల్లాలు రాష్ట్రంలో ఇప్పుడు 30 జిల్లాలు ఉన్నాయి. 51 శాతం నుంచి 75 శాతం ఆదిలాబాద్‌, కుమ్రంభీమ్‌ ఆసిఫాబాద్‌లో పడింది. మొత్తం వర్షపాతం 119.0 ఎంఎంకుగాను 66.9 శాతం పడింది. లోటు 44 శాతం తక్కువగా ఉంది.20 లోపు జిల్లాలు సంగారెడ్డి, రంగారెడ్డి, వికారాబాద్‌, నారాయణపేట్‌, నల్లగొండ, నాగర్‌కర్నూల్‌ ఉన్నాయి.
ప్రస్తుతం పంటల పరిస్థితి
వానాకాలంలో జూన్‌ 28 నాటికి 15 లక్షల ఎకరాల్లో పంటలు సాగు కావాల్సి ఉంది. ఇందులో 12.25 లక్షల ఎకరాల్లో పత్తి వేశారు. గత ఏడాది ఇదే సమయానికి 20 లక్షల ఎకరాల్లో సాగైంది. అంటే దాదాపు 5 లక్షల ఎకరాల్లో పంటలు వేయలేని పరిస్థితి నెలకొంది. పత్తి మాత్రం బాగానే సాగవుతున్నది. వరినాట్ల సంగతి పరిశీలిస్తే వానల్లేక ఇప్పుడిప్పుడే నార్లు పోస్తున్నరు. పత్తి, మొక్కజొన్న, పప్పుధాన్యాలు, నూనెగింజలు విత్తారు. కొన్ని చోట్ల మొలకెత్తలేదు. గింజలకు పురుగులు, చీమలు ఆశించి విత్తనాలను తినేశాయి. ఎండలు సైతం ఒక కారణం. మొలిచిన పంటలకు సంబంధించి పత్తి విషయంలో ఎకరానికి రూ. 5 వేలు ఖర్చుపెట్టారు. కొంత మంది రైతులు పెట్టుబడి పెట్టలేక వదిలేశారు.
కరువుతో నష్టం
     2014 నుంచి 2018 వరకు కరువులు తీవ్రంగా వచ్చాయి. భారీ నష్టం వచ్చింది. 2015లో రూ. వేల నష్టం వచ్చింది. రాష్ట్రం ఆవిర్భావం తొలినాళ్లల్లో కరువు రాగా, ఆతర్వాత వరదలు శాపంగా మారాయి. 2018-19 నుంచి ఒకే ప్రాంతంలో వరదలొచ్చాయి. కేంద్రం 14వ ఫైనాన్స్‌ కమిషన్‌ 2015 నుంచి 2020 వరకు, 15 వ ఫైనాన్స్‌ కమిషన్‌ 2020 నుంచి 2023 వరకు నిధులు ఇస్తున్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం భారీగా నష్టపరిహారం నిధులు ఇవ్వడం లేదు. బృందాలను పంపడంలో ఆలస్యం చేయడం, పదే పదే అడిగిన తర్వాత నిధులు ఇస్తుండటంతో ఆశించిన ప్రయోజనం ఉండటం లేదు.
కరువు..మానవజీవితాన్ని తీవ్రంగా ప్రభావం చేసే ప్రకృతి బీభత్సం. సాధారణంగా నెర్రెలు బారీన నేలలు..ఎండిపోయిన పంటలు..నీళ్లు లేక నోరు తెరిచిన బావులు, చెరువులు, కుంటలు కనిపిస్తాయి. వీటన్నింటిని చూస్తే భీకర కరువుగానే అందరమూ భావిస్తాం. కానీ, అసలు వాస్తవం వేరు. వర్షపాతం ఆధారంగా కరువును అంచనా వేస్తారు. దానికి కొన్ని ప్రత్యేక నిబంధనలు ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్రాన్ని కరువు మేఘాలు కమ్ముకుంటున్నాయి.
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
వానల్లేక పంటల సాగు తీవ్ర ఆలస్యమవుతున్నది. దీంతో మేఘాల కోసం ఆకాశానికేసి చూడాల్సిన పరిస్థితులు ఇప్పుడు నెలకొన్నాయి. ప్రతిరోజూ మబ్బులు కనిపిస్తున్నాయి. వాతావరణం ఉక్కగా ఉంటున్నది. కాగా, వర్షం మాత్రం కురవడం లేదు. ఆకాశం మేఘావృతం కావడమే తప్ప, వానల జాడ లేదు. ఒకవేళ పడ్డా చెదురు,ముదురు చినుకులు మినహా భారీ వర్షాలు కురవకపోవడం గమనార్హం.
వర్షపాతం…
పడాల్సినదానికన్నా 19 శాతం లోపు వర్షపాతం తక్కువ పడితే ‘లోటు’ వర్షపాతం అంటారు. 35 శాతం లోపు పడితే కరువు ప్రాంతంగా గుర్తిస్తారు. 35 శాతంపైన పడకపోతే తీవ్రమైన కరువు కింద భావిస్తారు. 500 మిల్లీమీటర్ల లోపు వర్షపాతం పడే ప్రాంతాలు ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్‌, నల్లగొండ జిల్లాలు వీటి కిందే వస్తాయి. 500 ఎం ఎం నుంచి 700 ఎంఎం వరకు వానలుపడ్డ ప్రాంతాల కింద ఉమ్మడి మెదక్‌, కరీంనగర్‌, నిజామాబాద్‌ జిల్లాలు ఉన్నాయి. 750 ఎంఎంపైన ఉమ్మడి ఖమ్మం, వరంగల్‌, ఆదిలాబాద్‌ ఉన్నాయి. ఇదిలావుండగా 2.5 ఎం. ఎం వర్షం పడితే ఒక వర్షం రోజు కింద పరిగణిస్తారు. 2.4 ఎంఎం పడితే ఒక తడిగా భావిస్తారు.
రైతుబంధు 15 లక్షల మందికే
రైతుబంధు 15 లక్షల మంది రైతులకే అందుతున్నది. 64 లక్షల మందికి ఇవ్వాల్సి ఉంది. కానీ, చాలా మంది ఈ పథకంపై ఆధారపడ్డారు. రుణ ప్రణాళిక ప్రకటించినా బ్యాంకులు అప్పులు ఇవ్వడం లేదు. ఒక్కో ఎకరాలకు కనీసం రూ. 5 వేలు పెట్టుబడిపెట్టారు. యంత్రాలతో దున్నడం, విత్తనాలు, డీఏపీ కోసం ఖర్చుపెట్టారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం విత్తిన తర్వాత 90 రోజుల పాటు పంటలపై ఫెరిత్రాయిడ్‌ మందులు కొట్టకూడదు. బాగా దెబ్బతిన్న పంట పెసరు. మూడురోజులు గట్టిగా ఎండలు కొడితే నాశనమవుతుంది. కందులు 5.62 లక్షల ఎకరాలకుగాను 85 వేల ఎకరాల్లో మాత్రమే సాగైంది. వేరుశెనగ వానాకాలంలో 20 వేల ఎకరాల్లో సాగు కావాల్సి ఉండగా, 729 ఎకరాల్లో మాత్రమే అయింది. ప్రభుత్వం నుంచి రుణాలు భారీగా లేకపోవడం, రైతుబంధు అందరికి అందకపోవడంతో ప్రయివేటు అప్పులు తెచ్చుకుంటున్న పరిస్థితి ఇప్పుడుంది.
చెరువులు నింపడం
సీఎం కేసీఆర్‌ ప్రకటన ప్రకారం ప్రాజెక్టుల్లోని నీళ్లతో చెరువులు నింపాల్సి ఉంది. మొట్టప్రాంతాలకు చెరువులు నింపడంతో ప్రయోజనం ఉండదు. వానాకాలంలో 1.34 కోట్ల ఎకరాల్లో పంటలు వేయాలి. కానీ, వర్షాభావంతో 15 లక్షల ఎకరాల్లో సాగుకావడం గమనార్హం. తక్కువ కాలంలో పండే ఆ మెట్ట పంటవిత్తనాలను రైతులకు అందుబాటులో తేవాల్సి ఉన్నా, ఆ ప్రయత్నాలేవీ సర్కాను నుంచి లేవు. మొక్కజొన్న, వేరుశెనగ, పత్తి, నూనెగింజలు, వరి ఒకే రకమైన విత్తనాలు మార్కెట్లో ఉన్నాయి. పరిశోధనలు లేకపోవడంతో తక్కువ కాలపరిమితి పంటల విత్తనాలు రాష్ట్రంలో దొరకడం లేదు. దీంతో పంటలువేసి నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10 వేలు పరిహారంగా చెల్లిస్తేనే మళ్లీ కొత్తగా విత్తనాలు తయారుచేయడానికి వీలుంటుంది.
మరమ్మత్తులు చేయాలి
ప్రాజెక్టులు, చెరువులు, కాలువలను వానాకాలంలో కచ్చితంగా మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉంది. చివరి ఆయకట్టు వరకు సాగునీరు వెళ్లేలా ఈ చర్యలు తీసుకోవాలి. కృష్ణా, గోదావరిలో వస్తున్న నీటిని ప్రాజెక్టులు నింపడానికి ఎత్తపోతల పథకాలను అన్నింటిని వినియోగించాలి. వ్యవసాయశాఖ, రెవెన్యూ శాఖ మొత్తం గణాంకాలు సేకరించి జరిగిన నష్టాన్ని అంచనా వేయాలి. మరో 10 రోజుల్లో వర్షాలు పడకపోతే వరి మినహా ఇతర పంటలను అనివార్యంగా మార్చాల్సి ఉంటుంది.
తీసుకోవాల్సిన చర్యలు
రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రైతులకు సాయం చేయాలి. ఆమేరకు కరువు అంచనా చర్యలు తీసుకోవాలి. కరువు అంచనా వేసి గణాంకాలు తీయాలి. కేంద్రానికి ప్రత్యేకంగా నివేదిక పంపించాలి. అక్కడి నుంచి ప్రత్యేక కరువు గుర్తింపు బృందాలను నుంచి రప్పించాలి. అనంతరం కరువు సాయం కోరాలి.
సంవత్సరం   కరువు       కేంద్రం(రూ. కోట్లలో)   నష్టం(రూ. కోట్లలో)
2015-16      231          3506                     1065
2016-17       313          2806                    288
2017-18       232             2200                  302
2018-19      280            1800                    318
2019-20       383          4500                    333
14,812 2306