– శాట్ చైర్మన్ శివసేనారెడ్డి వెల్లడి
నవతెలంగాణ-హైదరాబాద్ : సీఎం కప్ 2024 పోటీల్లో పోటీపడే క్రీడాకారులు ఆన్లైన్లో పేర్లు నమోదు చేసుకునే ప్రక్రియ శనివారం నుంచి మొదలైందని తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ (శాట్) చైర్మన్ కే. శివసేనారెడ్డి వెల్లడించారు. డిసెంబర్ 7 నుంచి గ్రామ స్థాయిలో సీఎం కప్ పోటీలు ఆరంభం కానున్న నేపథ్యంలో శివసేనారెడ్డి శనివారం ఎల్బీ స్టేడియంలోని ఆయన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘సీఎం కప్‌ను ఈసారి పకడ్బందిగా నిర్వహిస్తున్నాం. ఒలింపిక్ సంఘం, రాష్ట్ర క్రీడా సంఘాలతో సన్నాహక సమావేశాలు నిర్వహించాం. క్రీడా పండుగగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం. సీఎం కప్ పోటీల్లో పోటీపడే క్రీడాకారుల వివరాలను పొందుపరించేందుకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియకు శ్రీకారం చుట్టాం. డిసెంబర్ 7-8న గ్రామ స్థాయిలో, డిసెంబర్ 10-12 వరకు మండల స్థాయిలో, డిసెంబర్ 16-21 వరకు జిల్లా స్థాయిలో, డిసెంబర్ 27- జనవరి 2 వరకు రాష్ట్ర స్థాయిలో సీఎం కప్ పోటీలు ఉంటాయని’ శివసేనా రెడ్డి తెలిపారు.