టాలీవుడ్‌ ఇమేజ్‌ పెంచడానికి సీఎం దిశానిర్దేశం చేశారు : దిల్‌రాజు

Dill raju– అది అపోహ మాత్రమే
– బెనిఫిట్‌ షోలు, టికెట్‌ రేట్లు చాలా చిన్న సమస్య..
సినీ పరిశ్రమ అభివృద్ధి చెందేందుకు సీఎం రేవంత్‌ రెడ్డి విలువైన మార్గ దర్శకత్వం, సూచనలు అందించారని టీఎఫ్‌డిసి చైర్మన్‌, నిర్మాత దిల్‌ రాజు తెలిపారు. ఆయన నేతృత్వంలో పలువురు చిత్ర ప్రముఖులు గురువారం ఉదయం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో పాటు మరికొందరు క్యాబినెట్‌ మంత్రులతో సమావేశమయ్యారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పరిశ్రమ అభివృద్ధిపై చర్చించారు. ఈ చర్చ అనంతరం దిల్‌రాజు మీడియాతో మాట్లాడుతూ, ‘ఈ భేటీపై వస్తున్న నెగెటివ్‌ వార్తల్లో నిజం లేదు. జరగని ఘటనలను జరిగినట్లుగా దుష్ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి 0.5% వ్యతిరేకత కూడా లేదు. నిజానికి సినిమా పరిశ్రమకి ఈ ప్రభుత్వం చాలా మద్దతునిస్తోంది. చిత్ర పరిశ్రమ భవిష్యత్తు కోసం సీఎం తన సలహాలు, సూచనలను పంచుకున్నారు. హైదరాబాద్‌ను భారతీయ సినిమాకే కాకుండా హాలీవుడ్‌ నిర్మాణాలకు కూడా హబ్‌గా మార్చాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు. మేం ఆయనిచ్చిన సలహాలు, సూచనలపై దృష్టి పెడతాం. తదుపరి సమావేశంలో వివరణాత్మక ప్రతిపాదనను ఆయన ముందు ఉంచుతాం. అలాగే బెనిఫిట్స్‌ షోలు, టిక్కెట్‌ రేట్స్‌ గురించి అసలు టాపిక్కే రాలేదు. పోలీసులు సంధ్య థియేటర్‌ దగ్గర జరిగిన వీడియోలు మాకు ప్రదర్శించలేదు. బౌన్సర్స్‌ విషయాన్ని మాకు డీజీపీ చెప్పారు. ప్రతిదీ అకౌంట్‌బిలిటీగా ఉండాలి అని ఆయన సూచించారు. హాలీవుడ్‌ సినిమాలు కూడా హైదరాబాద్‌లో షూటింగ్‌ జరిపేలా అభివద్ధి చేద్దాం అన్నారు. హైదరాబాద్‌కు ఐటీ, ఫార్మా రంగాలు ఎంత కీలకమో సినీ పరిశ్రమ కూడా అంతే కీలకంగా సీఎం భావిస్తున్నారు. అలాగే సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా సెలబ్రటీలు పాల్గొనాలని స్పష్టం చేశారు. గద్దర్‌ అవార్డ్స్‌ను ఎఫ్‌డీసీతో అనుసంధానంగా జరగాలని చెప్పారు. తెలంగాణ అభివృద్ధిలో సినీ పరిశ్రమ సామాజిక బాధ్యతతో ఉండాలని సూచించారు. ఇక ఈ మధ్య జరిగిన పరిణామాల దృష్ట్యా ప్రభుత్వానికి, చిత్ర పరిశ్రమకు దూరం పెరిగిందనేది కేవలం అపోహ మాత్రమే. బెనిఫిట్‌ షోలు, టికెట్‌ రేట్లు అనేది చాలా చిన్న సమస్య. ఇంటర్నేషనల్‌గా టాలీవుడ్‌ ఇమేజ్‌ని మరింతగా పెంచే పెద్ద ఛాలెంజ్‌ను సీఎం మాకు ఇచ్చారు. ఆయన ఇచ్చిన ఛాలెంజ్‌ని సాధించడమే ఇప్పుడు మా ముందు ఉన్న లక్ష్యం’ అని అన్నారు. ఇదిలా ఉంటే, బెనిఫిట్‌ షోలు, టికెట్‌ రేట్ల పెంపుదల అనేది చాలా చిన్న సమస్య అని దిల్‌రాజు చెప్పిన అంశంలో పలువురు నిర్మాతలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయటం గమనార్హం.