రైతులు కన్నీరు పెడుతుంటే డైవర్షన్‌ పాలిటిక్స్‌తో సీఎం బిజీ

– ఎక్స్‌ వేదికగా కేటీఆర్‌ విమర్శ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ఓ వైపు రైతులు పొలాల్లో కన్నీరు పెడుతుంటే తెలంగాణ సీఎం రేవంత్‌ మాత్రం రోత పుట్టించే కూతలతో… డైవర్షన్‌ పాలిటిక్స్‌తో బిజీబిజీగా గడుపుతున్నారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఎక్స్‌ వేదికగా సీఎంపౖౖె ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్షం కారణంగా ఐకేపీ కేంద్రాల్లో ఉంచిన రైతుల ధాన్యం పూర్తిగా తడిసిపోయిందని ఓ రైతు విమర్శలు చేస్తున్న వీడియోను కేటీఆర్‌ పోస్ట్‌ చేసి… ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్‌ దళారి ప్రభుత్వం రైతులను నిండా ముంచిందని వాపోయారు. వానాకాలం వరికోతలు సాగుతున్నాయని… కానీ ఈరోజు వరకు రైతుబంధు వేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక రూ.15 వేల రైతు భరోసా ఊసే లేదన్నారు. కనీసం హార్వెస్ట్‌ చేసిన పంటను కూడా కొనుగోలు చేయడం లేదని విమర్శించారు. దీంతో రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. అకాల వర్షాలకు చాలాచోట్ల కల్లాల్లో, మార్కెట్‌ యార్డుల్లో ధాన్యం తడిసి ముద్దయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సీజన్‌లో 91.28 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరిస్తున్నారనీ, గత నెలలో 8.16 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని పౌరసరఫరాల శాఖ లక్ష్యంగా నిర్ణయించిందని వివరించారు. కానీ, పొయిన నెల 28 వరకు 913 మంది రైతుల నుంచి 7,629 టన్నుల ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేశారని తెలిపారు. రైతన్న అంటే కాంగ్రెస్‌ ప్రభుత్వానికి నిర్లక్ష్యమని విమర్శించారు. దళారులతో కుమ్మక్కైన ఈ కాంగ్రెస్‌ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం లేదని ఆరోపించారు. ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో మిల్లుల కేటాయింపు జరగనే లేదని విమర్శించారు.