ఉపాధి అవకాశాల కోసమే సీఎం తపన

– టీపీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్‌
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తపన పడుతున్నారని టీపీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్‌ చెప్పారు. ఆయా దేశాలకు చెందిన వివిధ కంపెనీల నుంచి పెట్టుబడులు రావడంతో యువతకు ఉపాధి అవకాశాలు భారీగా పెరుగుతాయని తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. విదేశీ పెట్టుబడుల రాకతో రాష్ట్రానికి చెందిన 10 లక్షల మంది యువతకు ప్రయివేటు రంగంలో పుష్కలంగా ఉద్యోగాలు దక్కుతాయన్నారు. స్కిల్‌ యూనివర్సిటీతో తెలంగాణ యువతకు డిగ్రీ పూర్తి అయినా వెంటనే ఉద్యోగం వస్తుందని చెప్పారు. మాజీ మంత్రి కేటీఆర్‌ సెల్ఫీల కోసం విదేశీ పర్యటన చేశారని ఎద్దేవా చేశారు. బీఆర్‌ఎస్‌ హయాంలో యువతకు ఎన్ని ఉద్యోగాలు ఇప్పించారో చెప్పగలరా? అని కేసీఆర్‌ను ప్రశ్నించారు.