సీఎం ఒకలా.. గణాంకాలు ఇంకోలా

CM is like..
Statistics are different– హర్యానాలో ఖట్టర్‌ సర్కారు అవాస్తవాలు
– నిరుద్యోగ రేటు తగ్గుతున్నదని వెల్లడి
– హర్యానాలోనే రెండో అత్యధిక నిరుద్యోగమంటున్న ఎన్‌ఎస్‌ఎస్‌ఓ సమాచారం
–  రాష్ట్ర ప్రభుత్వం తీరుపై ప్రతిపక్షం ఆగ్రహం
చండీగఢ్‌ : బీజేపీ పాలిత రాష్ట్రం హర్యానాలో నిరుద్యోగం ఆందోళన కలిగిస్తున్నది. అధికారిక గణాంకాల ప్రకారం భారత్‌లోని పెద్ద రాష్ట్రాల్లో అత్యధిక నిరుద్యోగం కలిగిన రెండో రాష్ట్రంగా హర్యానా ఉన్నది. అయినప్పటికీ, అక్కడి ప్రభుత్వం మాత్రం నిజాలను దాచిపెడుతున్నది. రాష్ట్రంలో నిరుద్యోగం తగ్గుతున్నదని ప్రచారాలు చేసుకుంటున్నది. ఇప్పుడిదే అక్కడి అధికారి, ప్రతిపక్షాల మధ్య నిప్పు రాజేస్తున్నది. ప్రభుత్వం తన వైఫల్యాన్ని కప్పి ఉంచుకోవటంలో భాగంగానే ఇలా అవాస్తవాలు ప్రచారం చేసుకుంటున్నదని అంటున్నది. రాష్ట్రంలోని యువతకు ఉద్యోగాలు కల్పిచంటంలో విఫలమవుతున్నదని ఆరోపిస్తున్నది.
2022 జులై నుంచి 2023 జూన్‌ వరకు ఉన్న నేషనల్‌ శాంపిల్‌ సర్వే ఆఫీస్‌ (ఎన్‌ఎస్‌ఎస్‌ఓ) సమాచారం ప్రకారం.. హర్యానాలో నిరుద్యోగ రేటు 6.1 శాతంగా (పట్టణ, గ్రామీణ ప్రాంతాలు కలుపుకొని) ఉన్నది. అలాగే, ఇక్కడ పట్టణ నిరుద్యోగ రేటు 6.5 శాతంగా ఉన్నది. అయితే, మనోహర్‌లాల్‌ఖట్టర్‌ సర్కారు రాష్ట్రంలో నిరుద్యోగ రేటు 6.1 శాతానికి తగ్గిందనీ, తమ ప్రభుత్వం నిర్విరామంగా తీసుకుంటున్న చర్యల కారణంగానే ఇది సాధ్యమైందని చెప్పుకుంటున్నది. 2014లో మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ అధికారంలోకి వచ్చిననాటి నుంచి రాష్ట్రంలోని యువతకు 1.10 లక్షలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించినట్టు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.
అయితే, ప్రభుత్వం వాదనలను అక్కడి ప్రతిపక్షాలు తప్పుబడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికీ నిరుద్యోగం ఆల్‌ టైమ్‌ గరిష్టంగా ఉన్నదని అంటున్నాయి. ”15 నుంచి 29 ఏండ్ల మధ్య వయస్సునవారిలో ప్రభుత్వం నిరుద్యోగ రేటును చూడాలి. అది 17.5 శాతంగా ఉన్నది. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చి న నాటి నుంచి యువతకు ఉద్యోగాలు అందటం లేదు. 2019లో ఆయన రెండో సారి అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని ప్రభుత్వ ఉద్యోగాలు మాత్ర మే యువతకు కల్పించబడ్డాయి” అని హర్యానా అసెంబ్లీలో ప్రతిపక్ష నేత భూపిందర్‌ సింగ్‌ హుడా అన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగం తీవ్ర స్థాయిలో ఉన్న దని హర్యానా యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులు దివ్యాన్షూ బుధిరాజ ఆరోపించారు.