
– సాగు, తాగు ,కరెంట్ కష్టాలు తీర్చిన సీఎం కేసీఆర్
– రైతు బంధు ,రైతు బీమా అందిస్తున్న బీఆర్ఎస్ సర్కార్
నవతెలంగాణ-దుబ్బాక రూరల్
రైతు హితమే ద్యేయంగా సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని తిమ్మాపూర్ ఎంపీటీసీ రామవరం మాధవి చంద్రశేఖర్ రెడ్డి ఏఎంసీ చైర్పర్సన్ చింతల జ్యోతి అన్నారు. శనివారం మండలంలోని తిమ్మాపూర్ రైతు వేదికలో జరిగిన రైతు దినోత్సవ వేడుకల్లో వారు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణలో బీడు వారిన భూములకు మల్లన్న సాగర్ కాల్వల ద్వారా రైతన్నలకు నీరు అందించి ఆకుపచ్చ తెలంగాణగా మార్చిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. 2014 కు ముందు తెలంగాణ లో ఎలాంటి పరిస్థితి ఉందొ..నేడు ఎంత మారాయో గమనించాలన్నారు. నాడు కరెంటు కోతలతో సాగునీటి గోసతో అష్ట కష్టాలు పడ్డామని గుర్తు చేశారు. నేడు సాగు,త్రాగు , కరెంటు సమస్యలు లేవని అన్నారు. అన్నదాతలకు రైతు బంధు, రైతు బీమా పథకాల ద్వారా ఎంతో మేలు జరిగిందన్నారు. తదనంతరం ఏఎంసీ చైర్పర్సన్ చింతల జ్యోతి మాట్లాడుతూ కేసీఆర్ రైతు సంక్షేమంలో తెలంగాణను దేశానికి ఆదర్శం గా నిలిచారన్నారు.దేశ వ్యాప్తంగా సీఎం కేసీఆర్ నాయ
కత్వం కావాలని కోరుకుంటున్నారని వారు తెలిపారు.తదనంతరం క్లస్టర్ పరిధిలోని తిమ్మాపూర్ ,పద్మనాభునిపల్లి ,అప్పనపల్లి, హసన్ మీరాపూర్ గ్రామాల రైతులకు రైతుబంధు , రైతు బీమా ద్వారా సహాయం పొందిన రైతుల వివరాలను సమావేశంలో ఏవో ప్రవీణ్ కుమార్ ,ఏఈవో చైతన్య రైతులందరీకి తెలియజేసి…ఖరీఫ్ సాగులో ఏఏ పంటలు వేయాలో రైతులకు వివరించారు.

రైతు రాజ్యం కాదు దళారుల రాజ్యం
– తమ సమస్యలు అధికారులు, ప్రజా ప్రతినిధులు పట్టించుకోవాలని వినతి
– తరుగు పేరుతో 5 కిలోలు కటింగ్
– సకాలంలో లారీలు రావడం లేదని ఆవేదన
– రైతువేదికల్లో అధికారులను ప్రశ్నించిన వైనం
దుబ్బాక మండలంలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా రైతు దినోత్సవ ఉత్సవాలు అన్ని ఏర్పాట్లు ప్రజా ప్రతినిధులు, అధికారులు ఘనంగా నిర్వహించారు. అనంతరం రైతువేదికలో నిర్వహించిన సమావేశంలో హసన్ మీరాపూర్ రైతు కనకచలం, నరేష్ తో పాటు పలువురు రైతులు యాసంగి సాగులో నష్టపోయిన రైతులకు పరిహారం ఎప్పుడూ అందుతుందని, ఐకేపీ కొనుగోలు సెంటర్లలో కొనుగోలు చేస్తున్న ధాన్యం రైస్ మిల్లుల వద్ద ఆగిపోతున్నాయని, తద్వారా సకాలంలో లారీలు లేక కొరత జాప్యం అవుతుందని రేయింబవళ్లు పడిగాపులు కాస్తున్నామన్నారు.క్వింటాలు ధాన్యానికి తరుగు పేరుతో సంచికి 5 కిలోల ధాన్యం కటింగ్ చేస్తూ రైతులను మోసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు అంత తరుగు, తాలు పేరుతో నిత్యం మిల్లర్ల చుట్టూ తిరుగు అలసిపోతున్నారని ఈసమస్యలను అధికారులు ప్రజా ప్రతినిధులు పట్టించుకోని సకాలంలో రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రైతు రాజ్యం కాదు దళారుల రాజ్యం అంటూ రైతులంతా అసహనం వ్యక్తం చేశారు కార్యక్రమంలో సర్పంచులు మంజుల,పర్శారాములు, తిమ్మాపూర్ ఉప సర్పంచ్ బాబు, ఏఎంసీ డైరెక్టర్ లింగం, రైతుబంధు సమన్వయ కమిటీ సభ్యులు సైదుగారి ఎల్లం, రైతు బంధు కోఆర్డినేటర్ నర్సారెడ్డి, రైతుబంధు విలేజ్ కోఆర్డినేటర్ నరేష్, ఆయా గ్రామాల రైతులు, సెక్రటరీలున్నారు.