డిసెంబర్‌ 4న పెద్దపల్లిలో సీఎం సభ

– ఏర్పాట్లపై మంత్రి శ్రీధర్‌ బాబు ఉన్నతస్థాయి సమీక్ష
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
పెద్దపల్లిలో డిసెంబర్‌ 4న నిర్వహించే యువ శక్తి సభకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి హాజరై దాదాపు 9,000 మందికి ఉద్యోగ నియామక పత్రాలను అందజేస్తారని రాష్ట్ర పరిశ్రమలు,ఐటి శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు తెలిపారు. ఆ సభ ఏర్పాట్లపై శుక్రవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో ఆయన ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఒక సంవత్సరం పూర్తయిన సందర్బంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో యువత కై ప్రత్యేకంగా నిర్వహిస్తున్న ఈ సభలో ఇటీవల గ్రూప్‌ 4లో ఎంపికైన 8,143 మందికి, 442 సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్లు, సింగరేణిలో ఉద్యోగాలు పొందిన వారికి రాష్ట్ర ముఖ్యమంత్రి నియామక పత్రాలను అందచేస్తారని వివరించారు. ఈ సభలోనే స్కిల్‌ యూనివర్సిటీలో బాగస్వామ్యమయ్యే 7 ఏజెన్సీలతో ఒప్పంద పత్రాలను సంతకాలు చేస్తారనీ, డిజిటల్‌ ఎంప్లాయిమెంట్‌ ఎక్స్చేంజ్‌ ప్రారంభోత్సవం, సీఎం కప్‌ ప్రారంభంతో పాటు వందలాది కోట్ల రూపాయల విలువైన అనేక కార్యక్రమాలను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని వెల్లడించారు. వివిధ రంగాల్లో ఉన్న ఉద్యోగ అవకాశాలను తెలియచేసే దాదాపు 40 స్టాళ్లను ఈ సభా వేదిక వద్ద ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. పెద్దపల్లి సభకు విస్తత ఏర్పాట్లను చేయాలని అధికారులను మంత్రి శ్రీధర్‌ బాబు ఆదేశించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారితో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.