– వర్సిటీల అభివృద్ధి, అధ్యాపకుల ఖాళీలు, నిధుల కేటాయింపుపై చర్చ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
విశ్వవిద్యాలయాల నూతన ఉపకులపతుల (వీసీ)తో శనివారం హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నివాసంలో సమావేశం కానున్నారు. ఈనెల 18న నూతన వీసీలను రాష్ట్ర ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. సామాజిక తరగతులు, వారి ప్రతిభ ఆధారంగా వీసీలను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. 107 ఏండ్ల ఉస్మానియా విశ్వవిద్యాలయం (ఓయూ) చరిత్రలో దళిత ప్రొఫెసర్ ఎం కుమార్‌కు వీసీ పదవిని ప్రభుత్వం కట్టబెట్టింది. కేయూ వీసీగా ప్రతాప్‌రెడ్డి, పీయూ వీసీగా జీఎన్ శ్రీనివాస్, ఎస్‌యూ వీసీగా ఉమేష్‌కుమార్, పీఎస్టీయూ వీసీగా నిత్యానందరావు, ఎంజీయూ వీసీగా అల్తాఫ్ హుస్సేన్, టీయూ వీసీగా యాదగిరిరావు, వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీగా అల్దాస్ జానయ్య, ఉద్యాన విశ్వవిద్యాలయం వీసీగా రాజిరెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. అంతకుముందు మహిళా విశ్వవిద్యాలయం వీసీగా ధనావత్ సూర్య, ఆర్జీయూకేటీ బాసర త్రిపుల్‌ఐటీ వీసీగా ఎ గోవర్ధన్‌ను ప్రభుత్వం నియమించింది. దీంతో రాష్ట్రంలో 11 విశ్వవిద్యాలయాలకు వీసీలను నియామకం పూర్తయ్యింది. ఉన్నత విద్యామండలి చైర్మెన్‌గా వి బాలకిష్టారెడ్డి, వైస్ చైర్మెన్‌గా ఇటిక్యాల పురుషోత్తంను ప్రభుత్వం నియమించింది. తొలిసారిగా వారితో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శనివారం సమావేశం కానున్నారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, విశ్వవిద్యాలయాలు సాధించాల్సిన ప్రగతి, విద్యార్థులకు అందించాల్సిన మౌలిక వసతులు, అధ్యాపక పోస్టుల ఖాళీలు, నిధుల కేటాయింపు వంటి అంశాలపై చర్చించే అవకాశమున్నది. నూతన వీసీల నుంచి ప్రభుత్వం ఎలాంటి ప్రగతిని ఆశిస్తున్నదో సీఎం రేవంత్‌రెడ్డి దిశానిర్దేశం చేయనున్నట్టు తెలిసింది. వర్సిటీల్లో ఉన్న ఇబ్బందుల గురించి వీసీల నుంచి అడిగి తెలుసుకునే అవకాశమున్నది.
వారం, పది రోజుల్లో అంబేద్కర్ వీసీ నియామకం : బుర్రా వెంకటేశం
వారం, పది రోజుల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వీసీ నియామకం ప్రక్రియ పూర్తవుతుందని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం చెప్పారు. శుక్రవారం రాజ్‌భవన్‌లో తనను కలిసిన విలేకర్లతో ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ వర్సిటీ సెర్చ్ కమిటీ సమావేశం ఇప్పటికే జరిగిందని వివరించారు. జేఎన్ఏఎఫ్ఏయూ సెర్చ్ కమిటీ సమావేశం జరగాల్సి ఉందన్నారు. జేఎన్టీయూహెచ్ వీసీ నియామకంపై కొంత ఇబ్బంది వచ్చిందని చెప్పారు. సెర్చ్ కమిటీ నిర్వహించినా వీసీ పేరును గవర్నర్ ఆమోదించలేదనీ, ఆ సెర్చ్ కమిటీని రద్దు చేస్తారా?అన్న ప్రశ్నకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉందని అన్నారు.