– ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మకాం నామినేటెడ్ పదవులపై అధినాయకత్వంతో సమావేశం
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి శుక్రవారం రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. నేడు (శనివారం) పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది. అయితే మంత్రులు స్వస్థలాలకు వెళ్లడంతో అందుబాటులో లేనట్టు తెలుస్తుంది. అపాయింట్‌మెంట్ ఖరారయితే రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలను వారి దృష్టికి తీసుకెళ్లనున్నారు. అలాగే పార్టీ అగ్రనేతలను కూడా కలిసే అవకాశం ఉంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కెసి వేణుగోపాల్ తదితరులను కలవనున్నారు. ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థుల ఖరారు, నామినేటెడ్ పోస్టుల భర్తీ తదితర అంశాలను చర్చించనున్నారు. అనంతరం ఢిల్లీ నుంచి శనివారం రాత్రి పశ్చిమ బెంగాల్ వెళ్లి, అక్కడ నుంచి మణిపూర్ వెళ్లనున్నారు. ఆదివారం మణిపూర్ లో ప్రారంభం కానున్న రాహుల్ గాంధీ భారత్ జోడో న్యారు యోధలో పాల్గొననున్నారు. అనంతరం తిరిగి ఆదివారం రాత్రికి ఢిల్లీ చేరుకొని, అక్కడ నుంచి దావోస్ లో 15 నుంచి 19 వరకు జరిగే వరల్డ్ ఎకనమిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్)-2024 సమావేశంలో పాల్గొనేందుకు స్విట్జర్లాండ్ వెళ్లనున్నారు. అనంతరం 19న లండన్ వెళ్లనున్నారు. 20న తిరిగి దేశానికి రానున్నారు.