– ఇన్‌చార్జి దీపాదాస్ మున్షి కూడా
– పార్లమెంటరీ నియోజకవర్గాల సమన్వయకర్తలు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
పార్లమెంటు ఎన్నికలకు ఏఐసీసీ సన్నద్దమవుతున్నది. సంబంధిత ఎన్నికల వ్యూహంపై చర్చించేందుకు దేశ వ్యాప్తంగా ఉన్న కీలక నాయకులతో గురువారం ఢిల్లీలో భేటీ కానుంది. ప్రస్తుత దేశ రాజకీయ పరిస్థితులు, రాహుల్‌గాంధీ భారత్ జోడో న్యారు యాత్ర, పార్లమెంటు ఎన్నికలు తదితర అంశాలపై ఈ భేటీలో చర్చించనున్నారు. ఈ సమావేశానికి సీఎం ఎనుముల రేవంత్‌రెడ్డి, మంత్రులు, రాష్ట్ర ఇన్‌చార్జి దీపాదాస్ మున్షి, పార్లమెంటు నియోజకవర్గాల ఏఐసీసీ సమన్వయకర్తలు హాజరు కానున్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి ఎక్కువ మంది ఎంపీలను గెలిపించుకునేందుకు అధిస్టానం కూడా టార్గెట్ పెట్టినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో 17 ఎంపీ స్థానాలు ఉన్నాయి. అందులో 12 సీట్లకు తగ్గకుండా గెలవాలనే లక్ష్యంతో సీఎం, మంత్రులు, పార్టీ నేతలు ఉన్నారు. ఇప్పటికే ఆ విషయాన్ని రేవంత్ చెప్పిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి ఉమ్మడి ఐదు జిల్లాల చొప్పున రెండు రోజులపాటు ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులతో పార్లమెంటు ఎన్నికలపై సమీక్షించారు. ఆ ఎన్నికలను సీరియస్‌గా తీసుకోవాలని దిశా నిర్దేశం చేశారు. మరోవైపు హస్తం పార్టీకి చెందిన చాలా మంది నేతలు ఎంపీ టికెట్లు ఆశిస్తున్నారు. పార్లమెంటు ఎన్నికలపై రూపొందించిన కార్యాచరణను ఏఐసీసీ సమావేశంలో సీఎం రేవంత్ సమర్పించనున్నారు.
జగ్గారెడ్డి ఢిల్లీకి పయనం
మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఢిల్లీకి పయనమయ్యారు. బుధవారం మధ్యాహ్నం ఆయన రైల్లో ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. మంగళవారం హైదరబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన ఆయన…మరుసటి రోజే ఆఘమేఘాల మీద హస్తినకు వెళ్లడం పార్టీలో చర్చనీయాంశమైంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఆయన తొలిసారి ఢిల్లీ వెళ్లి అధిష్టానాన్ని కలవడంతో ఏం ఆశించి అక్కడికి వెళ్లారనే అంశం పార్టీ నేతల్లో చర్చ జరుగుతున్నది. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ఎంపీ పోటీ చేయనున్నారా? ఎమ్మెల్సీ ద్వారా మంత్రిపదవి అడుగనున్నారా? టీపీసీసీ అధ్యక్షపదవి ఆశిస్తున్నారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.