నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేసిన తీరు సరిగా లేదని ఆరోపిస్తూ తెలంగాణ మాల విద్యార్థి జేఏసీ మాదాసు రాహుల్ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్స్ కళాశాల వద్ద సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. వర్గీకరణ వల్ల మాలలు నష్టపోయారని మండిపడ్డారు. నిన్నటి రోజు ఫిబ్రవరి 4 2025 ను మాలలు అందరూ బ్లాక్ డే గా ప్రకటిస్తున్నామని అన్నారు. మాలల జీవితాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చీకటి రోజు నింపిందని మండిపడ్డారు. మాలలు అందరూ ఇప్పటికైనా మేలుకోవాలని ఏ రాజకీయ పార్టీ మనకు అండగాలేదని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తడి గుడ్డతో మాలల గొంతు కోశారని మండిపడ్డారు. ఓయూలో మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ విషయంలో కాంగ్రెస్ పార్టీ మాల సామాజిక వర్గానికి ద్రోహం చేసిందని అన్నారు. అసెంబ్లీలో హౌస్ కమిటీ వేయకుండా మాల, మాదిగ ప్రతినిధులను సంప్రదించకుండా వర్గీకరణ చేయడం సరికాదన్నారు. కార్యక్రమంలో భీమ్ మిషన్ ఆఫ్ ఇండియా వర్కింగ్ ప్రెసిడెంట్ మందాల భాస్కర్, అంసా ఓయూ అధ్యక్షుడు నామ సైదులు పాల్గొన్నారు.